బీర్కూర్, జనవరి 12: ప్రతి మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో జనరల్ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వీటి నిర్మాణంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు. బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించిన జనరల్ ఫంక్షన్‌హాల్‌ను సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి-పుష్పమ్మ దంపతులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ.. గ్రామంలో నిర్మించిన జనరల్ ఫంక్షన్‌హాల్ రైతునగర్‌కు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.
అంగరంగ వైభవంగా వివాహ వేడుకలతో పాటు పలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు సులభతరమైందన్నారు. ప్రజల సౌకర్యార్థం రైతునగర్ గ్రామంలో జనరల్ ఫంక్షన్‌హాల్ నిర్మించినందుకు సర్పంచ్ మద్దినేని నాగేశ్వర్‌రావ్‌ను స్పీకర్ అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ద్రోణవల్లి అశోక్, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, ఎంపీటీసీ సందీప్, ఎంపీపీ రఘు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.