ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతవరకు సురక్షితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయనే దానిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇరుకు గదులు, రోడ్డుపైనే పార్కింగ్, కనీసం ఓ చిన్న వాహనం కూడా లోపలకు వెళ్లలేని విధంగా పెద్దపెద్ద భవనాలను నిర్మించడంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తే నివారణ చర్యలు చేపట్టలేని పరిస్థితి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఫైర్ సేఫ్టీలేని వ్యాపార సముదాయాలను గుర్తించి చర్యలుచేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
-నిజామాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని కీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు 40గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. దట్టమైన పొగతో చుట్టు పక్కల ప్రాంతాలవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఏవీ లేకపోవడంతో ఈ ప్రమాదంలో మంటలను అదుపు చేయడం కష్టతరమైంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫర్నిచర్ దుకాణంలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఘటన జరగడంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆస్తి నష్టం జరిగింది. సువిశాలమైన ప్రాంతంలో నిర్మాణం ఉన్నప్పటికీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు మధ్యాహ్నం జరిగి ఉంటే షాపింగ్ కోసం వచ్చిన వారు బయట పడడం కష్టతరమైన పనిగా చాలా మంది భావిస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏటా ఉమ్మడి జిల్లాలో చిన్నా చితక అగ్ని ప్రమాదాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. కనీస నిబంధనలను వ్యాపారులు పాటించడం లేదు. తద్వారా సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లకపోయినప్పటికీ హైదరాబాద్లో ఈ మధ్యే వెలుగు చూసిన గుల్జార్ హౌస్ ఘటనతోనైనా అగ్నిమాపక శాఖతో పాటుగా మిగిలిన శాఖలు తక్షణం కళ్లు తెరిచి ప్రజల రక్షణ కోసం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రస్తుతం ప్రైవేటు దవాఖానల్లో ప్రత్యేక బృందాల తనిఖీ కొనసాగుతున్నది. భవనం ఎత్తును అనుసరించి, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఫైర్ సేఫ్టీ ఉందా? లేదా ? అనే కోణంలో పరిశీలిస్తున్నం. కొన్నింటికి ప్రమాణాలు ఉన్నట్లుగా భావిస్తున్నాం. లేని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. డీఎంహెచ్వో ఇచ్చిన జాబితా ప్రకారం ఆయా దవాఖానలను తనిఖీ చేస్తున్నం. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూసేందుకు అప్రమత్తమయ్యాం. 15 మీటర్లు ఎత్తు ఉన్న బిల్డింగ్కు తప్పనిసరిగా ఎన్వోసీని అగ్నిమాపక శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
– టి.పరమేశ్వర్,అగ్నిమాపక శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్లో దాదాపు 400, కామారెడ్డి జిల్లాలో సుమారు 200 వరకు దవాఖానలు ఉన్నాయి. 10 నుంచి 100 పడకల సామర్థ్యం కలిగిన వైద్యశాలలు వెలిశాయి. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు దవాఖానలు తప్ప చాలా వరకు నిబంధనలకు నీళ్లొదిలాయి. గల్లీల్లో దవాఖానలను ఎడాపెడా ఏర్పాటు చేశారు. భవన నిర్మాణం, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఇతర అనుమతుల కోసం నగర పాలక సంస్థ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పోలీస్ శాఖ నుంచి యాజమాన్యాలు అనుమతులు తీసుకోవాలి. ఆయా శాఖల్లోని కొందరు అధికారులు.. ఆయా దవాఖానలోని లొసుగులే అస్త్రంగా తీసుకుని వసూళ్లకు తెగబడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పక్కాగా తనిఖీలు చేసి అనుమతివ్వాలి. తొలుత 90 రోజులకు తాత్కాలికంగా పర్మిషన్ ఇవ్వాలి. నిబంధనల ప్రకారం నడుస్తున్నాయని భావిస్తే అయిదేండ్లకు పొడిగించాలి. కానీ ముడుపుల యావలో ఇవేమీ పట్టించుకోవడం లేదు. అగ్నిప్రమాద నివారణ చర్యలు అంతంతమాత్రమే. ఉమ్మడి జిల్లాలో వ్యాపార, వాణిజ్య భవనాలతోపాటు ప్రైవేటు దవాఖానలు సగానికి ఎక్కువ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదంటే అనుమతుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నామమాత్రంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తుండడంతో ప్రమాదాలు జరిగితే అందులో పని చేసే కార్మికులు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోయే ప్రమాదం పొంచి ఉన్నది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో ద్విచక్ర వాహనంపై తిరగడం ఒక సాహసం. అలాంటిది అనుకోని ఘటన ఏదైనా జరిగితే అగ్నిమాపక వాహనం చక్కర్లు కొట్టడం కష్టతరమైన పని. ఇరుకైన భవనాల్లో కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ పేరుతో అనేక దవాఖానలు వెలిశాయి. వీటిల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేవు. అయినప్పటికీ వీటికి అనుమతులు మంజూరు కావడం వెనుక మతలబు ఏమిటనే దానిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు సునిశితంగా పరిశీలించి ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ లేకుండానే మున్సిపల్ కార్పొరేషన్, వైద్యారోగ్య శాఖల నుంచి ఎడాపెడా అనుమతులు జారీ అవుతున్నాయి. తద్వారా అనేక దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భద్రత లేని భవనాల్లో కార్యకలాపాలకు యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడం గమనార్హం.
ఇటీవల ఖలీల్వాడిలోని ఓ దవాఖానలో లిఫ్ట్ మొరాయిస్తే మెట్ల మార్గంలో రోగులను తరలించడం కష్టతరమైంది. కనీసం నడవడానికి కూడా మెట్లు సరిగా లేకపోవడంతో రోగులు, బంధువులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. అదే దవాఖానలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు సంబంధిత శాఖల వద్ద జవాబు లేకుండా పోయింది. ఓవైపు నగరపాలక సంస్థ అధికారులు, మరోవైపు అగ్నిమాపక శాఖ, వైద్యారోగ్య శాఖ, పోలీస్ శాఖలకు చెందిన అధికారులంతా ప్రజల రక్షణకు ఆయా దవాఖానల యాజమాన్యాలతో రాజీ పడుతుండడమే ఈ దురవస్థకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా అనుమతులు జారీ కావడంతో దవాఖానలను ఏర్పాటు చేసి యాజమాన్యాలు రూ.లక్షల్లో ప్రజల నుంచి దోచుకుంటున్నారు. తీరా ఏదైనా ఘటన జరిగితే చేతులు ఎత్తేసి ఆయా శాఖలను మేనేజ్ చేసుకుంటూ తమకేమీ సంబంధం లేదన్నట్లుగా దులుపేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.