నిజాంసాగర్, ఏప్రిల్ 4: మండలంలోని మల్లూర్ గ్రామంలో బారడి పోచమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కుస్తీ పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకున్నది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కుస్తీ వీరుడి తలపై కానిస్టేబుల్ లాఠీతో దాడిచేయడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మండలంలోని వడ్డేపల్లికి చెందిన పోతరాజు మైశయ్య వచ్చి, ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో నిర్వాహకులు అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాల్‌రాజ్ తన లాఠీతో మైసయ్యపై దాడిచేయడంతో అతడు స్పృహా కొల్పోయాడు.

అతడి తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఎస్సై శివకుమార్ వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని ఎల్లారెడ్డి దవాఖానకు తరలించారు. ఈ విషయమై ఎస్సై మాట్లాడుతూ.. మైసయ్య న్యూసెన్స్ చేస్తూ పోటీలకు, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించాడని అన్నారు. అతడి తల రింగుకు తాకడంతో గాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుడిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. 73 బీఎసీ వచ్చిందన్నారు. దీంతో మైసయ్యతోపాటు అతనికి సహకరిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.