police Constable | వినాయక నగర్, మే 18 : ప్రజల ఆస్తులతో పాటు, వారికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ వక్ర బుద్ధి బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బులు అవసరం ఉన్న వారి దగ్గరికి స్వయంగా వెళుతూ వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ డబ్బులు అప్పుగా ఇవ్వడం వ్యాపారంగా పెట్టుకున్నాడు.
అక్రమంగా వడ్డీ వ్యాపారం చేయడమే కాకుండా తన వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్న వారి వద్ద నుండి ముక్కుపుండి మరి అధిక వడ్డీ వసూలు చేస్తూ లక్షల్లో లావాదేవీలు నడుపుతున్న ఓ సివిల్ కానిస్టేబుల్ వ్యవహార శైలి ఎట్టకేలకు బట్టబయలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మెండోరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఖాకీ
మెండోరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కలివేరి గంగాధర్ (సీనియర్ కానిస్టేబుల్) గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా చిత్తూరు నడపడంతో పాటు వడ్డీ వ్యాపారం సైతం కొనసాగిస్తున్నాడు. సదరు కానిస్టేబుల్ రూ.100 ఐదు శాతం చొప్పున అవసరం ఉన్నవారికి డబ్బులను బాకీలుగా ఇవ్వడమే వ్యాపారంగా కొనసాగిస్తున్నాడు. సదరు కానిస్టేబుల్ అవసరమున్న వారికి డబ్బులను ఊరికేనే ఇవ్వకుండా, వారికి సంబంధించిన ఆస్తులు ప్రాపర్టీలను తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి అధిక వడ్డీకి డబ్బులు బాకీగా ఇస్తున్నాడు.
గత రెండేళ్ల క్రితం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మహిళకు డబ్బులు అవసరం ఉండడంతో విషయం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ నేరుగా ఆమె వద్దకు వెళ్లినట్లు సమాచారం. మీకు డబ్బులు అవసరం ఉన్నవి కదా నేను ఇస్తాను వడ్డీకి మీ దగ్గర ఉన్న రూ.20 లక్షల విలువ చేసే ప్లాటు తన పేరు మీద చేయాలంటూ తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. అనంతరం వడ్డీ పేరుతో సదరు మహిళను తరచూ ఇబ్బందులు పెడుతుండడంతో విసిగి వేసారి పోయిన బాధితురాలు శనివారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో కానిస్టేబుల్ గంగాధర్ పై రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ కేసు నమోదు చేశారు. అలాగే మరొకరికి సైతం డబ్బులు అవసరం ఉండడంతో అధిక వడ్డీకి వారికి డబ్బులను బాకీగా ఇచ్చిన కానిస్టేబుల్ వడ్డీ కట్టాలంటూ వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ మరో సంఘటనలో సైతం కానిస్టేబుల్ గంగాధర్ పై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.