Nizamabad | కంఠేశ్వర్, మార్చి 11: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 56 వేల ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు ఎందుకు ఓటు వేయలేరో అని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రమోషన్లు, బదిలీలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల సమస్యలను తీర్చిందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం నిరాశ పరిచిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు .ఇంకా ఎక్కువగా కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వైపు ముందడుగు వేస్తామని తెలిపారు.
పసుపు నిజామాబాద్‌లో పండిస్తే.. బోర్డు ఢిల్లీలో ఎందుకు?
పసుపు ధర ఒక్కసారిగా పడిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పసుపు కొనుగోళ్లకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్‌కు తెలిపినట్లు చెప్పారు. రైతులను ఆదుకుంటామని అన్నారు. పసుపు బోర్డు తీసుకొచ్చానని ఎంపీ ధర్మపురి అర్వింద్ గొప్పలు చెప్పుకుంటున్నారని.. నిజామాబాద్‌లో పసుపు పండిస్తే, బోర్డును ఢిల్లీలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
జిల్లాకు చెందిన వారే పసుపు బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పటికీ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. పసుపు రైతులకు అన్యాయం జరుగుతుంటే అర్వింద్ ఎక్కడ మొహం పెట్టుకుంటాడో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఏడాది పసుపు ధర పెరిగితే.. అది కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులు చేయడం ద్వారానే పెరిగిందని చెప్పిన అర్వింద్.. ఇప్పుడు పసుపు ధర తగ్గిన క్రమంలో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.