బోధన్/కామారెడ్డి/ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రలోభాలకు తెర లేచింది. మద్యం, మాంసంతో పాటు ఇతరత్రా కానుకల పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. ఆ వెంటనే కొందరు అభ్యర్థులు ఓటర్లపై తాయిలాలు వెదజల్లడం ప్రారంభించారు. ఎల్లారెడ్డిలో ఓ పార్టీ నేతలు ఇంటింటికీ చికెన్ పొట్లాలు పంపించారు. మరో అభ్యర్థి తన వార్డు పరిధిలోని ఓటర్లకు హారతి పళ్లెం పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బిచ్కుంద, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, బాన్సువాడ పట్టణాల్లోనూ ప్రలోభాలు జోరందుకున్నాయి.
నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. దాదాపు పది రోజుల పాటు ప్రచారంతో హోరెత్తించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. వందల మందిని వెంటేసుకుని గల్లీగల్లీ చుట్టేశారు. అయితే, మిగతా పార్టీలకు భిన్నంగా బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికాబద్ధంగా ఓటర్లకు చేరువయ్యారు. వార్డుల వారీగా బాధ్యతలు పంచుకుని ఇంటింటికీ తిరిగారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికార బలాన్ని నమ్ముకుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం గత పదేండ్లలో జరిగిన అభివృద్ధిని, రెండేండ్లలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
ప్రచార పర్వం ముగియడంతో అధికార పార్టీతో పాటు బీజేపీ ప్రలోభాలకు తెర లేపింది. పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో విచ్చలవిడిగా తాయిలాలు వెదజల్లాయి. ఎల్లారెడ్డిలో ఓ పార్టీ అభ్యర్థి హారతి ప్లేట్లు పంపిణీ చేయడం గమనార్హం. మరో పార్టీ నేతలు సోమవారం ఇంటింటికీ కిలో చికెన్ పొట్లాలు పంపిణీ చేశారు. చికెన్ వద్దు అన్నవారికి అరకిలో మటన్‌ను పంపించారు. గత రెండ్రోజులుగా మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌లు సరఫరా చేశారు. వీటికి అదనంగా సోమవారం రాత్రి నుంచి డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ.1500 నుంచి రూ.3 వేలు ఇచ్చినట్లు సమాచారం.
డివిజన్లు, వార్డుల్లో మద్యం ఏరులై పారుతుండగా, మరోపక్క డబ్బుల పంపకాలు జోరందుకున్నాయి. బోధన్‌లో ఓ వ్యక్తి తాను గెలిస్తే ఇంటింటికీ కూలర్ పంపిణీ చేస్తానని బహిరంగంగానే ప్రకటన చేయగా, మరోవ్యక్తి ఎవరైనా చనిపోతే ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఇక, ప్రత్యర్థి ఎంత పంచుతున్నాడు.. అని అంచనా వేస్తూ అంతకుమించి ఓటర్లను ఇవ్వటానికి ఎత్తులు వేయడంలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. ఇక, యథేచ్ఛగా పంపకాలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తున్నది.
ఎల్లారెడ్డి రూరల్/ఎల్లారెడ్డి ఫిబ్రవరి 9: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగంపేటలో కాంగ్రెస్ నాయకులు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. రాత్రి 7 గంటల తర్వాత లింగారెడ్డిపేట్లో ఇతర మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మద్యం, డబ్బులు పంచుతున్నారని తెలియడంతో జాజాల సురేందర్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు.
బయటి వ్యక్తులను పంపించి వేయాలని లేదంటే, తాము ఆందోళన చేస్తామని జాజాల చెప్పడంతో పోలీసులు అక్కడ ఉన్నవారిని పంపించే ప్రయత్నం చేశారు. ముందుగా స్థానికేతరులపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేయాలని జాజాల పట్టుబట్టి, పోలీసుల తీరును నిరసిస్తూ ఎల్లారెడ్డి గాంధీచౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే అండతో విచ్చలవిడిగా మద్యం, డబ్బులను పంపిణీ చేస్తుంటే, పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని ఇంటలిజెన్స్ రిపోర్టు రావడంతో డబ్బుల పంపకానికి తెరలేపారని మండిపడ్డారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్ జాజాలను సముదాయించే ప్రయత్నం చేశారు. 12వ వార్డులో మద్యం పంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ రావడంతో అక్కడికి తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి పరారయ్యారు.