నస్రుల్లాబాద్, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. గ్రామంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. డీజే పాటల విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సాదుల రాములు (45), గ్రామానికి చెందిన జెల్ల సాయికుమార్, గంపల సుధాకర్, మొండి భాస్కర్, కొప్పుల దివ్య తదితరులు కాంగ్రెస్ పార్టీకి చెందిన డీజే పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కీసరి రవి, కొంగల అనిల్, కొంగల గోపాల్, కొంగల వినోద్ వారి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పాటలు పెట్టాలని కోరారు. ఇది గమనించిన సాదుల రాములు, విఠల్, భూమయ్య, సాయిలు, హన్మాండ్లు, జెల్ల సాయికుమార్, గైని సాయిలు కలుగజేసుకుని వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీంతో గోపాల్.. సాదుల రాములును దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరిస్తూ వెనుదిరిగారు.
కాసేపటికే రాములు ప్రైమరీ పాఠశాల వైపు నుంచి వెళ్తుండగా, అక్కడే ఉన్న కీసరి రవి, అనిల్, గోపాల్, వినోద్ ఒక్కసారిగా దాడి చేసి పిడి గుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించకుండా అడ్డుకున్నారు. నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ జగన్నాథరెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. మరోవైపు, గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చలసాని సుధీర్ అండ చూసుకొని తన భర్తను హత్య చేశారని, అతడితో పాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు