Former MLA Jeevan Reddy | ఆర్మూర్, డిసెంబర్ 3 : ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్) అవినీతి మేతకు, పదేళ్లుగా ఏపుగా పెరుగుతున్న పచ్చని చెట్ల నరికివేతకు గురయ్యాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ‘నమస్తే ఆర్మూర్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలో పర్యటించిన జీవన్ రెడ్డి బస్–స్టాండ్ వద్ద డివైడర్ పై పెంచిన చెట్లను నరికివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నాటిన మొక్కలు పదేళ్లుగా నీడనిచ్చే చెట్లుగా ఏపుగా పెరిగి , డివైడర్ కు ఇరువైపులా విద్యుత్ లైట్ల కాంతిని కంట్రోలు చేస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడుతుండగా వాటిని ఇష్టారీతిన నరికివేయడం దారుణమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ చెట్ల నరికివేతతో ఆర్మూర్ పట్టణ సుందరీకరణ లక్ష్యం దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ డివైడర్ ఆర్మూర్–నిజామాబాద్ రోడ్డుకు సంబంధించినదని, ఇది నాగపూర్ హైవేకు కనెక్టివిటీ ఉన్న రోడ్డు అని ఆయన పేర్కొన్నారు. డివైడర్ పై అడ్వర్టైజ్ మెంట్ బోర్డులు పెట్టడానికి అడ్డుగా ఉన్నాయని, సుమారు 400 చెట్లను తొలగించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసనరమైతే తప్ప ఎలాంటి పర్మిషన్ లేకుండా చెట్లను నరికేసే అధికారం ఎక్కడిదని ఆయన నిలదీశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ కేవలం కమిషన్ల వసూళ్ల కోసం తన తాబేదారుకు అడ్వర్టైజ్ మెంట్ బోర్డులు పెట్టడానికి కాంట్రాక్టు ఇప్పించి సరికొత్త దోపిడీకి పాల్పడ్డారని ఆయన అన్నారు.బోర్డులు అందరికీ స్పష్టంగా కనిపించడానికి వీలుగా డివైడర్ పై కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెంచిన చెట్లను ఇష్టారాజ్యంగా నరకడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చర్యపై ప్రకృతి ప్రేమికులతో పాటు ఆర్మూర్ పట్టణ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నదని ఆయన చెప్పారు. 3 కిలో మీటర్ల పొడవునా 400 చెట్లను నేలకూల్చిన తప్పిదం కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి వత్తిడితో మున్సిపల్ అధికారుల నిర్వాకం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. కలెక్టర్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి లేకుండా చెట్లను నరికే అధికారం ఎక్కడిది? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ కమిషన్ల పిచ్చికి బంగారం లాంటి పచ్చని చెట్లు బలయ్యాయని ఆయన నిప్పులు చెరిగారు.
సమస్యల పరిష్కారానికే జనతా గ్యారేజీ
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆర్మూర్ నియోజకవర్గంలో సాగిస్తున్న అరాచకాలను, అవినీతి భాగోతాలను అడ్డుకోవడానికి, ప్రజల పక్షాన పోరాడటానికి తన ఇంటిని జనతాగ్యారేజ్ గా మార్చిన తరువాత నమోదైన డివైడర్ పై చెట్ల నరికివేత మొదటి కేసు అని ఆయన అన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, ప్రజలకు అన్యాయం చేసే వారిపైనే తమ పోరాటమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారి కనీవినీ ఎరుగని స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన బెదిరింపులకు లొంగి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులు పీవీఆర్ అవినీతికి, అరాచకాలకు అండగా నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. కనీసం వార్డు మెంబర్ కాదుకదా గవర్నమెంట్ లో చెప్రాసి కూడా కాని వినయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విధుల్లో ఎలా జోక్యం చేసుకుంటారని?, ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను ఎలా పర్యవేక్షిస్తారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
పీవీఆర్ మాట వినే అధి కారులు జైలుపాలు కాక తప్పదన్నారు. ఇప్పటికే వినయ్ కుమార్ రెడ్డి అవినీతిలో పాలుపంచుకొని పలువురు రెవెన్యూ అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారని, గతంలో ఒక ఎంవీఐతో పాటు తాజాగా ఆర్మూర్ మునిసిపల్ కమిషనర్ రాజ్ కుమార్ ఏసీబీ వలలో చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ నియామకం జరగడం హర్షణీయమన్నారు. కొత్త కమిషనర్ అయినా పాత కమిషనర్ మాదిరిగా కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి అవినీతికి కొమ్ము కాయకుండా ప్రజల కోసం పని చేయాలన్నారు.
కొత్త కమిషనర్ వెంటనే డివైడర్ పై నరికేసిన చెట్ల స్థానంలో కనీసం కొబ్బరి మొక్కలనైనా నాటించాలని ఆయన సూచించారు. కాగా ఆర్మూర్ లో చెట్ల నరికివేతపై కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చెట్ల నరికివేతను సుమోటోగా స్వీకరించి బాధ్యులపై కేసు నమోదు చేయాలన్నారు. ప్రజల కోసం అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటమే తమ జనతాగ్యారేజ్ లక్ష్యమన్నారు.
అన్యాయాలకు కొమ్ము కాసే వారిపై పింక్ బుక్
కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కు ఇచ్చిన రెండేళ్ల గడువు పూర్తయిందన్నారు. ఇక వచ్చే మూడేళ్లు తాను నియోజకవర్గంలోనే ఉండి ప్రజల పక్షాన నిలబడతానని తెలిపారు. అన్యాయాలకు కొమ్ముకాసే అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, అందరి లెక్కలు వడ్డీతో సహా తేలుస్తాం అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పోల సుధాకర్, సుంకరి రవి, రంజిత్, గిరిష్ తదితరులు పాల్గొన్నారు.