వేల్పూర్, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించిందని, తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్క బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే వేముల నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు పూర్ణానందం, రేంగుట దేవేందర్, మొండి అశోక్, బట్టాపూర్ ప్రవీణ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. అధికారంలోకి రావడానికి బీసీలను ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకున్న కాంగ్రెస్.. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు ఆ ఆంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. బీసీలను రిజర్వేషన్ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించపోవడం బీసీలపై నిర్లక్షాన్ని స్పష్టంగా చూపుతున్నదని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల్లో బీసీలకు రూ.లక్షన్నర కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఈ బడ్జెట్లో కేవలం 3.85శాతం మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. గడిచిన రెండేండ్లలో 20శాతం కంటే తక్కువ ఖర్చు చేయడం ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుంతోందని విమర్శించారు.
వృత్తి ఆధారిత పథకాలకు ఈ బడ్జెట్లో సున్నా కేటాయింపులు చేయడం తీవ్ర నిరాశ కలిస్తోందన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధ్ద హోదా ఇవ్వాలని ప్రకటించిన ప్రభుత్వం ఆ ఆంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12వేల కోట్లపై ఉన్నాయని, వాటిపై కూడా ఎలాంటి ప్రస్తావన లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర వేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం తగిన సయమంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చౌట్పల్లి రవి, రేగుల్ల రాములు, కొత్తపల్లి అశోక్, రామ్రాజ్ గౌడ్, శ్రీనివాస్ పాలెం, రాజేశ్వర్, మాణిక్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.