మోర్తాడ్, మే 11: కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రైతులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం.. కాంగ్రెస్ పాలనలో దండగగా మారిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం మోర్తాడ్‌లో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో వేముల మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయి లో నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రైతులు కరెంటు, నీళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు మళ్లీ రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది తప్పితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నదని వేముల అన్నారు. గన్నీ సంచులులేవు, లారీలు అందుబాటులో లేవు, కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. లారీలు ఉన్నచోట సంచులు ఉండవు, సంచులు ఉన్నచోట లారీలు ఉండవని మండిపడ్డారు. వర్షాల భయంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధర రూ.2,380 ఉంటే, వ్యాపారులు రూ.1,750లకే కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు ఎకరానికి రూ.20 వేల దాకా నష్టపోవాల్సి వస్తున్నదన్నారు. రైస్‌మిల్లర్లు తరుగు పేరిట బహి రంగంగా దోచుకుంటున్నారని, క్వింటాల్‌కు 12 కిలోల వరకు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులకు రైతు సమస్యల కంటే ఇసుక దందాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇసుక కోసం ట్రాక్టర్లు పంపించడం కాదు, వడ్ల కోసం లారీలు పంపించే ఏర్పాటు చేసి రైతుల సమస్యల తీర్చాలని అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. కలెక్టర్, పౌరసరాఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్లు ఎత్తడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలతోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని రైతులే చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో యూరియా సులభంగా లభించేదని, ఇప్పుడు యాప్ విధానంతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి యూరియాను అన్ని సొసైటీల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
బాల్కొండ నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. నియోజకవర్గంలో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఇన్చార్జి ఉండి కూడా రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు రుణమాఫీ విషయంలో చాలెంజ్ చేశానని, దానికి ప్రతిగా కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి చర్చకు ఎక్కడకు రావాలి అంటూ సవాల్ విసురుతున్నారని తెలిపారు.
ప్రభుత్వంలో ఉన్న వారు రాజకీయ సవాళ్లు విసరడం మానేసి, రైతుల కష్టాలను తీర్చాలని సూచించారు. మీ స్వగ్రామమైన మానాలకు ఒక్క లారీ రాక రైతుల దగ్గర నుంచి ఒక్క సంచి వడ్లు కొనలేకపోయారని, అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి చాలెంజ్‌లు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ ఇన్చార్జికి ఇసుక లారీలు దొరుకుతున్నాయని, కానీ రైతుల వడ్లు తరలించేందుకు మాత్రం లారీలు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, కల్లెడ ఏలియా, రేగుంట దేవేందర్, ప్రవీణ్‌రెడ్డి, రైతు నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.