నిజామాబాద్, మే 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారం తలపోటుగా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ప్రధాన మీడియా స్రవంతిని మేనేజ్ చేసినప్పటికీ సామాన్యులు మాత్రం ఈ వ్యవహారంపై బీజేపీని వెంటాడుతున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీలో నిత్యం నీతులు చెప్పే లోక్‌సభ సభ్యులు, ముఖ్య నేతల అకౌంట్లలోకి చొచ్చుకెళ్లి కామెంట్స్ పెడుతున్నారు. దాదాపుగా వారం రోజులు గడుస్తున్నప్పటికీ బండి సంజయ్ వ్యవహారంపై బీజేపీ పార్టీ తగిన రీతిలో స్పందించకపోవడంపై నిలదీస్తున్నారు.
ఓ మైనర్ బాలికను అన్యాయం చేస్తే నోరు విప్పరా? ఇదేమి దౌర్జన్యం అంటు అడుగుతున్నారు. హైదరాబాద్ రహ్మత్‌నగర్‌కు చెందిన అనిత అనే ఓ మహిళ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి సంజయ్‌కు ఫోన్ చేసి నిలదీశారు. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై ఎందుకు స్పందించడం లేదు? దీనిపై మీ స్పందన ఏమిటి? అని ప్రశ్నించగా అర్వింద్ ఒక్కసారిగా అవాక్కు తినాల్సి వచ్చింది. మహిళ కావడంతో జాగ్రత్తగా మాట్లాడి తప్పించుకున్నాడు. ముగింపులో తన అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ఆధారాలు లేకపోయినప్పటికీ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలపై నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడే బీజేపీ ఎంపీలు ఎవ్వరూ బాలికకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
బీజేపీకి సోషల్ మీడియానే ఊపిరి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన కల్పిత ప్రచారాలకు తెర లేపింది. తమకు నచ్చని వ్యక్తులు, రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ అసత్యాలను వ్యాప్తి చెందించింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విషం చిమ్మింది. అనేక మాధ్యమాల్లో మత పరమైన పోస్టులు పెట్టిస్తూ ప్రోత్సహించింది. స్వయంగా జాతీయ నేతలే విద్వేషపూరితమైన ప్రసంగాలతో జనాలను పక్కదారి పట్టించిన ఆనవాళ్లు సైతం ఉన్నాయి. యువతకు పనికి వచ్చే అంశాలను పక్కకు నెట్టి మతం అనే ఉచ్చులోకి లాగి విలువైన జీవితాలను రోడ్డుకు లాగిన ఘటనలు ఉన్నాయి.
సోషల్ మీడియాను నమ్ముకుని రాజకీయంగా ఎదిగిన బీజేపీకి ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అన్నట్లుగా సోషల్ మీడియాలో తెలంగాణ పౌరులంతా కలిసి రాగ ద్వేషాలకు అతీతంగా మైనర్ బాలికకు న్యాయం చేయాలని బీజేపీని ప్రశ్నిస్తున్నారు. గుక్క తిప్పుకోనివ్వకుండా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసిన ఆకృత్యాలను ఆధారాలతో సహా బట్టబయలు చేసి బీజేపీ సోషల్ మీడియా వింగ్ చేష్టలకు కళ్లెం వేస్తున్నారు. అవకాశం దొరికితే అవతలి వ్యక్తులను చెడుగుడు ఆడుకునే బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు అందరూ నెటిజన్ల దెబ్బకు మౌనం వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. కళ్ల ముందు బండి సంజయ్ కుమారుడు చేసిన చేష్టలు కనిపిస్తున్నప్పటికీ నీతి, నిజాయితీ అంటూ నీతులు చెప్పే కాషాయ పార్టీ నేతలంతా నోరు మూసుకుని కూర్చుండి పోతున్నారు.
పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదైన 24గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది బండి కుమారుడ్ని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అరెస్ట్ చేయకుండా కాలాయాపన చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బహిరంగంగానే సహకరిస్తోందని నిప్పు లు చెరుగుతున్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చిన వారు ఎంతటి వ్యక్తులైన వారందరినీ వదిలి పెట్టొద్దంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రసంగాలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు.
మోడీ సభపై బండి సంజయ్‌ను కూర్చోబెట్టుకోవడం, ఆ పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసీనులు కావడంపైనా రుసరుసమంటున్నారు. సాధారణ మనుషులు తప్పు చేస్తే రాత్రికి రాత్రి ఎత్తుకు పోయే తెలంగాణ పోలీసులకు బండి సంజయ్ కుమారుడి ఆచూకీ దొరక్కపోవడంపై అంతటా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. తప్పించుకునేందుకు పుష్కలమైన అవకాశాలు కల్పించి తాజాగా బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పోలీసుల నుంచి లీకులు రావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్నోడికి, సంపన్నులకు చట్టాలను చుట్టాలుగా మార్చారా? అని ప్రశ్నిస్తున్నారు. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును ఛేదించి మైనర్ బాలికకు న్యాయం చేయడం తెలంగాణ పోలీసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారింది.