నందిపేట్, జనవరి 11 : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ రాజ్యమంటే హింసా, ధ్వంసమేనా ? ప్రజాపాలనంటే కాంగ్రెస్ కండకావరమా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజాసమస్యలపై ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చాక దాడులు, విద్వేష, విష సంస్కృతులు, అక్రమ నిర్బంధాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే కాంగ్రెస్‌కు పుట్టగతులుండేవా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలోప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడికి నిలయంగా మారిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని, కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుంటామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.