కామారెడ్డి, జూన్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వానాకాలం, యాసంగిలో ధాన్యాన్ని అమ్మడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా నిలిపారని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి గతంలో రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రం వాటా ప్రకారం కొంటామని చెప్పడం దారుణమని పేర్కొన్నారు.
సన్న, దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 11 గంటలు మాత్రమే ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పులపాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ చరిత్రలో రైతులకు పెట్టుబడి అనేది ఎక్కడా లేదని తెలిపారు. 11 విడుతల్లో రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 7,600 మంది రైతులకు రైతుబీమా ఇవ్వలేదన్నారు. రైతు భరోసా రూ.15వేలు అని చెప్పి రూ.12 వేలకు తగ్గించి మూడు విడుతలు ఎగ్గొట్టిందని మండిపడ్డారు.
యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ బడా బాయి, రేవంత్రెడ్డి చోటా బాయి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈ రెండున్నరేండ్లలో ఢిల్లీకి 71 సార్లు తన సొంత ప్రయోజనాల కోసం వెళ్లాడే తప్ప, ప్రజల కోసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉం టుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నాయకులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, స్వామి పాల్గొన్నారు.