ఎక్కడో విసిరి పారేసినట్టు ఉండే తండాలు.. అభివృద్ధి మచ్చుకైనా కనిపించని గిరిజన గూడేలు.. కనీస వసతులు లేని దౌర్భాగ్య పరిస్థితులు.. ఎన్నో ఏండ్లుగా అనుభవించిన దుస్థితికి సీఎం కేసీఆర్‌తోనే విముక్తి లభించింది. 500లకు పైగా జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చడంతో అభివృద్ధి విస్తరించింది. స్వయం పాలనతో గిరిపుత్రుల జీవితాల్లో పెనుమార్పు వచ్చింది. రెండు రోజుల క్రితమే శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్.. అడవి బిడ్డలపై వరాల జల్లు కురిపించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ప్రకటించారు. భూమి లేని వారికి దళితబంధు తరహాలో గిరిజనబంధు అమలు చేస్తామని అన్నారు. అత్యంత వెనుకబడిన 11 సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అంతేకాదు, అద్దెభవనాల్లో కొనసాగుతున్న గిరిజన పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తండాల్లో ఆత్మగౌరవ పాలన కొనసాగేందుకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఉమ్మడి జిల్లాలోని 73 గిరిజన పంచాయతీలకు పక్కా భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
భీమ్‌గల్, ఫిబ్రవరి 11: సమైక్య పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న తండాలు తెలంగాణ రాష్ట్రంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో అడవి బిడ్డల జీవితాలకు కొత్త వెలుగులు వచ్చాయి. 500లకు పైగా జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిపుత్రులకే పాలనా పగ్గాలు చేతికి వచ్చాయి. ఫలితంగా మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు విస్తరించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతి, హరితహారం వంటి పథకాలతో తండాల్లో అద్భుతాలు నమోదయ్యాయి. అయితే, కొత్త పంచాయతీలు సొంత గూడు లేక ఇన్నాళ్లు అద్దె భవనాల్లో కొనసాగాయి. ఆత్మగౌరవ పాలన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గిరిపుత్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
73 గిరిజన జీపీలకు పక్కా భవనాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 1,216 గిరిజన తండాల్లో జీపీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.243 కోట్లు మంజూరు చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఒక్కో జీపీ నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 73 పంచాయతీలకు కలిపి రూ.14.60 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో 35, కామారెడ్డి జిల్లాలో 38 గిరిజన తండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం నిధులు మంజూరయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలోని గిరిజన జీపీలు ఇవే..
భీమ్‌గల్ మండలంలోని కారేపల్లి, మూడుగుడిసెల తండా, సంతోష్‌నగర్ తండా, సుదర్శన్ తండా, తాళ్లపల్లి, బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తండా, ధర్పల్లి మండలంలోని బెలియా తండా, ధనంబండ, ఇందిరానగర్ తండా, మరియా తండా, మోబిన్‌సాబ్ తండా, డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి తండా, నాకా తండా, సాంపల్లి తండా, వెస్లీనగర్ తండా, ఇందల్వాయి మండలంలోని రంజిత్‌నాయక్ తండా, స్టేషన్ తండా, జక్రాన్‌పల్లి మండలంలోని చాంద్‌మియా బాగ్, నల్లగుట్ట తండా, వివేక్‌నగర్ తండా, మాక్లూ ర్ మండలంలోని అమ్రాద్ తండా, కింది తండా, మోపాల్ మండలంలోని భైరాపూర్, కాష్బాగ్ తండా, కులాస్పూర్, నిజామాబాద్ రూరల్ మండలంలోని ధర్మా రం, రెంజల్ మండలంలోని కిషన్ తండా, సిరికొండ మండలంలోని గడ్డమీది తండా, మెట్టుమర్రి తండా, వర్జున్ తండా, వర్ని మండలంలోని అంతాపూర్ తండా, మేడిపల్లి తండా, పొట్టిగుట్ట తండా, రాజంపేట్, సయీద్పూర్ తండా పంచాయతీలకు పక్కా భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
కామారెడ్డిలో 38 పంచాయతీలు..
కామారెడ్డి జిల్లాలో 38 కొత్త జీపీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. బాన్సువాడ మండలంలోని జక్కల్‌దాని తండా, కొయ్యగుట్ట తండా, పులికుచ్చ తండా, గాంధారి మండలంలోని సోమారం, పెద్ద గుజ్జుల్ తండా, లొంక తండా, గండివేట్ తండా, పర్మళ్ల తండా, గుడి వెనుక తండా, హేమ్లానాయక్ తండా, జుక్కల్ మండలం మధుర తండా, కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి తండా, లింగంపేట్ మండలంలోని రాంపల్లి స్కూల్ తండా, మాలోత్ సంగ్యానాయక్ తండా, కొయ్యగుండు తండా, బానాపూర్ తండా, నల్లమడుగు పెద్ద తండా, మాలోత్‌తండా, మాచారెడ్డి మండలంలోని కాకులగుట్ట తండా, సర్దాపూర్ తండా, నెమలిగుట్ట తండా, నాగిరెడ్డిపేట్ మండలం పల్లెబొగుడ తండా, మెల్లెకుంట తండా, నస్రుల్లాబాద్ మండలం లింగంపల్లి తండా, రాములగుట్ట తండా, నిజాంసాగర్ మండలం మల్లూర్ తండా, ధూప్‌సింగ్ తండా, పెద్దకొడప్గల్ మండలం చిన్నదేవీసింగ్ తండా, తలాబ్ తండా, కాటిపల్లి తండా, పిట్లం మండలం కోమటిచెరువు తండా, రాజంపేట్ మండలం ఎల్లాపూర్ తండా, షేర్ శంకర్ తండా, రామారెడ్డి మండలం గోకుల్, కన్నాపూర్, సదాశివనగర్ మండలం వజ్జపల్లి తండా, సజ్యానాయక్ తండా, ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండా, తిమ్మారెడ్డి తండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
గిరిజన తండాల గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. స్వపరిపాలన చేసుకునేలా తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది… ప్రస్తుతం పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం. గిరిజనుల పక్షాన నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్.
– కవిత, సర్పంచ్, సంతోష్ నగర్ తండా
కేసీఆర్ వెంటే గిరిజనమంతా..
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం గర్వకారణంగా ఉన్నది. గిరిజన సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– బానావత్ లలిత, సర్పంచ్, తాళ్లపల్లి