కామారెడ్డి, సెప్టెంబర్ 22 :రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో.. అతడికి వేసిన కుట్లను ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది విప్పేశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్నది.
ఇం దుకుసంబంధించిన వివరాలు..పట్టణానికి చెం దిన శ్రీను అనే యువకుడు బైక్ అదుపుతప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. రక్తస్రావం కావడంతో వెంటనే స్థానిక అపెక్స్ దవాఖానకు వెళ్లాడు. డాక్టర్ (కన్సల్టేషన్)ఫీజు 300 రూపాయలు చెల్లించి చూపించుకున్నాడు. ప్రమాదంలో తగిలిన గాయాలకు దవాఖాన సిబ్బంది కుట్లు వేశారు.
అయితే యువకుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడెట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోవాలని చెప్పడంతో దవాఖాన సిబ్బంది నిరాకరించి ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. తన వద్ద నగదు లేదని చెప్పినప్పటికీ ఆగ్రహించిన దవాఖాన సిబ్బంది యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. చివరికి దవాఖాన సిబ్బంది యువకుడికి వేసిన కుట్లను విప్పేసి పంపించి వారిలోని పైశాచికత్వాన్ని చాటుకున్నారు. అనంతరం సదరు యువకుడిని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.