మోర్తాడ్/ వేల్పూర్, నవంబర్ 2 : తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమ్మర్పల్లి, వేల్పూర్ మండలకేంద్రాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులను విలీనం, రెగ్యులరైజ్ చేయాలని అన్నారు.
ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసే వరకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమ్మర్పల్లిలో సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షురాలు గంగామణి, సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్, అంజయ్య, మంజుల, పెద్దులు, రతన్, వేల్పూర్లో ఎమ్మార్సీ సిబ్బంది కృష్ణమూర్తి, సీఆర్పీలు, ఐఈఆర్పీలు శైలజ, మౌలిక, ఝాన్సీరాణి, శ్రీనివాస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.