Telangana University | నిజామాబాద్, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తీరుపై యూనివర్సిటీ పాలక మండలి(ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. రవీందర్ గుప్తా వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన నిధుల దుర్వినియోగం, అక్రమ నియామకాలు, ప్రమోషన్ల వ్యవహారంపై విచారించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలాగే, నిధుల దుర్వినియోగంపై క్రిమినల్ కేసు నమోదు చేయించాలని నిర్ణయించింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రూసా భవనంలో బుధవారం జరిగిన టీయూ పాలకవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాలకమండలి సభ్యులు గంగాధర్‌గౌడ్, వసుంధర, శాస్త్రి, వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, ఇన్చార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధిని, వర్సిటీ ప్రిన్సిపల్ ఆరతి, ప్రొఫెసర్లు రవీందర్‌రెడ్డి, నసీమ్ తదితరులు పాల్గొన్నారు.
వీసీ అక్రమాలపై విచారణ..
తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని వివాదాస్పదంగా మార్చిన ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ గుప్తాపై విచారణకు ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని నియమించనున్నది. వీసీ తన పదవి కాలంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకునేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే టీయూ ఈసీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి నోటిఫికేషన్లు, ఈసీ అనుమతి లేకుండా ఎడాపెడా వందలాది మంది నియామకం, ఆచార్యులకు ప్రమోషన్లు, శాఖాపరమైన బాధ్యతలు, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల పెంపు, బిల్లులు లేకుండానే యూనివర్సిటీలో సదుపాయాల పే రిట దుబారా ఖర్చు వంటి అంశాలతోపాటు యూనివర్సిటీ నిధుల మళ్లింపు, దుర్వినియోగంపైనా విచారణ జరుగనున్నది. నవంబర్ 27, 2021 అనంతర కాలం జారీచేసిన వీసీ ఉత్తర్వులన్నింటినీ పాలకవర్గం రద్దు చేసింది. ఈసీ సమావేశంలో ప్రొఫెసర్ విద్యావర్ధినిని రిజిస్ట్రార్‌గా నియమించడంపైనా చర్చ జరిగింది. ఈ నిర్ణయం కూడా అక్రమమేనని పాలకవర్గం తేల్చింది. రిజిస్ట్రార్ హోదాలో విద్యావర్ధిని తీసుకున్న ప్రతి నిర్ణయం ఆమె వ్యక్తిగత వ్యవహారంగా చూడాలని ఈసీ నిర్ణయించింది. 2022, ఆగస్టు 16న విద్యావర్ధినిని రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈసీ అప్రూవ్ చేయకుండానే వీసీ తతంగాన్ని నడిపించారు. బుధవారం నాటి ఈసీ సమావేశంలో విద్యావర్ధినిని కనీసం లోనికి కూడా అనుమతించలేదు. గతంలో ఈసీ అప్రూవ్ చేసిన ప్రొఫెసర్ యాదగిరినే రిజిస్ట్రార్‌గా కొనసాగించేలా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది.
ఆరుసార్లు రిజిస్ట్రార్ల మార్పు..
తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన తీరు ఏ విధంగా ఉందో కేవలం రిజిస్ట్రార్ల మార్పు అంశం ఒక్కటే తేటతెల్లం చేస్తున్నది. 2021, మే 22న తెలంగాణ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా నియమితులయ్యారు. నాటి నుంచి ఆయన ఇష్టానుసారంగా రిజిస్ట్రార్లను మార్చుతున్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సెప్టెంబర్ ఒకటిన రిజిస్ట్రార్‌గా ఉన్న నసీమ్‌ను తొలగించి కనకయ్యకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఈసీ అనుమతి లేకుండానే ఇతని హయాంలో అనేక నిర్ణయాలను తీసుకోవడం వివాదాస్పదమైంది. యూనివర్సిటీలో వందలాది మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అక్రమంగా నియమించారు. వివాదాస్పదంగా మారిన వీసీ తీరుతో పాలక మండలి 2021లో అక్టోబర్ 30న యూనివర్సిటీలో సమావేశమైంది. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే నవంబర్ 27న హైదరాబాద్‌లోని రూసా భవనంలో మరో మీటింగ్‌ను నిర్వహించింది. అప్పటి వరకు ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న కనకయ్యను ఈసీ తొలగించి యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించింది. పాలకమండలి ఆదేశాలను ధిక్కరించి వీసీ రవీందర్ గుప్తా మరోమారు రిజిస్ట్రార్‌గా శివశంకర్‌ను నియమించారు. అంతలోనే తాను చెప్పినట్లు వినట్లేదని, సంతకాలు చేయట్లేదని భావించిన వీసీ అతడిని కూడా తప్పించి విద్యావర్ధినికి బాధ్యతలిచ్చారు. విద్యావర్ధిని నియామకం చెల్లదంటూ ఈసీ తేల్చి చెప్పి తిరిగి యాదగిరికి రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించింది.
బరితెగింపునకు పరాకాష్ట..
నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం పలుమార్లు ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని తుంగలో తొక్కి యూనివర్సిటీలో యథేచ్ఛగా నియామకాలు చేపట్టారు రవీందర్ గుప్తా. అతడు వీసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఎడాపెడా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో వీసీ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే 2021, సెప్టెంబర్ 24న రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలే జరుగొద్దని ఆదేశాలు అందాయి. అయినప్పటికీ ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులను పట్టించుకోకుండానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో బరితెగింపు బహిరంగంగానే కొనసాగింది. 2023, ఫిబ్రవరి 20న ఉన్నత విద్యాశాఖ మరోసారి జీవోను జారీచేసింది. యూనివర్సిటీల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి నియామకాలు చేయకూడదని పేర్కొన్నది. నియామకాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అనైతిక చర్యలకు పాల్పడొద్దంటూ పేర్కొంది. అయినప్పటికీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పైసలిచ్చినోడిదే రాజ్యం అన్నట్లుగా డబ్బులివ్వడం.. యథేచ్ఛగా ఆయా పోస్టుల్లో అనామకులు కూర్చుండడం అన్నది శరామామూలే అన్నట్లుగా మారింది.
మిన్నకుండిపోయిన వీసీ రవీందర్ గుప్తా..
తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గ సమావేశంలో సభ్యులంతా వీసీ రవీందర్ గుప్తా తీరుపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసినట్లు తెలిసింది. ‘ప్రభుత్వం నియమించిన ఈసీ మెంబర్లు అంటే నీకు పట్టదా? పాలకవర్గం అంటే ఏమనుకుంటున్నా వ్?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉండి కూడా ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావ్. ఇందులో నీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ అడిగారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ‘ప్రొఫెసర్‌గా పనిచేసిన నీకు పాలకవర్గం విలువ ఏమిటో తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈసీ సభ్యుల ఫోన్లు ఎత్తకపోవడం, కనీసం సమాచారం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, ఇదంతా నీ ఇంటి వ్యవహారమా?’ అంటూ రవీందర్‌గుప్తాను సభ్యులు గట్టిగానే మందలించారు. ‘ప్రైవేటు విద్యాసంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తిని రిజిస్ట్రార్‌గా ఎలా నియమిస్తావ్?’ అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నువ్వు చేసినది, చేస్తున్నదంతా అక్రమమే అంటూ నిలదీయడంతో వీసీ రవీందర్‌గుప్తా మౌనమే సమాధానం అన్నట్లుగా మిన్నకుండిపోవడం ఈసీ సభ్యులను నివ్వెరపర్చేలా చేయడం గమనార్హం.