ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 15 : ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకూ తీసుకువెళ్లాలన్న ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతున్నదని బీఆర్ఎస్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిధులతో కలిసి నగరంలోని ఐటీ హబ్‌ను బుధవారం పరిశీలించారు. ఐటీ టవర్ ప్రారంభం అనంతరం వెంటనే ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నట్లు మహేశ్ తెలిపారు. ఐటీహబ్‌లో అన్ని వసతులు కల్పించారని, ఇంక్యుబేషన్ సెంటర్‌కూడా ఉందని సంతోషం వ్యక్తంచేశారు. నిజామాబాద్ నగరానికి ఐటీహబ్ అభివద్ధికి కావాల్సిన అన్ని అనుకూలతలు ఉన్నాయని అన్నారు. వందలమంది ఎన్నారైలు విదేశాల్లో ఐటీ కంపెనీలు స్థాపించారని, రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు ముందుకువచ్చిన వారికి ప్రభుత్వ పరమైన రాయితీలు కల్పించనున్నట్లు చెప్పారు. అనంతరం ప్రతినిధుల బృందం అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాతో భేటీ అయ్యింది. నగరానికి త్వరలోనే ఐటీ కంపెనీలు రానున్నాయని, ఐటీ హబ్ ప్రచారం కోసం గురువారం ఇట్సర్వ్ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, ఐటీ తెలంగాణ సీఈవో విజయ్ రంగినేని, మహేశ్ బిగాల హాజరవుతారని వెల్లడించారు.
నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. ఐటీ హబ్ పనుల ప్రగతిపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరపాలక సంస్థ నూతన భవన సముదాయం, ఖలీల్‌వాడీ, అహ్మదీబజార్ సమీకృత మార్కెట్ యార్డులు, దుబ్బ, కోటగల్లీ, ఖిల్లా, ఆర్సపల్లి వైకుంఠధామాలు, రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పనులను వేగవంతంగా చేపట్టి గడువులోగా పూర్తయ్యేలా కృషి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మరో నెలన్నర రోజుల్లో పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధగా ముందుకెళ్లాలన్నారు. ప్రతిచోటా పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రారంభోత్సవాల నాటికి చిన్నపని కూడా పెండింగ్‌లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వాటిని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బిగాల తెలిపారు. వారి వెంట మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.