ఖలీల్‌వాడి, జూన్ 21: కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ జిల్లాలో ఆదివారం ‘నీట్ -యూజీ 2026’ రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేసి ఎగ్జామ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరుపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా అన్నది గమనించిన కలెక్టర్, వాటి ఫుటేజీల ఆధారంగా నిర్ణీత సమయంలోనే ప్రశ్నపత్రాలను తెరిచారా ? లేదా ? అన్నది నిర్ధారణ చేసుకున్నారు.
కాపీయింగ్, పేపర్ లీక్‌కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జామర్లను, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణం గా తనిఖీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో నీట్ పరీక్షకు 86.55 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్ష రాయగా 465 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
వినాయక్‌నగర్, జూన్ 21 : నీట్ పరీక్ష ప్రశాంతంగా సాగేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పా ట్లు చేశామని కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ, బోధన్, నిజామాబాద్‌లోని నీట్ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జీజీ కాలేజీ వద్ద నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. మరొకరు బోధన్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉండగా నిజామాబాద్‌కు వచ్చి పరీక్షకు హాజరు కాలేకపోయారు. యువతులకు చెవి కమ్మలు, మెడలో గొలుసు, చేతికి గాజులు లాంటివి అనుమతించలేదు. ఎండలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు.