కంఠేశ్వర్, జనవరి 27 : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు.
మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ నిరంతరం నిఘాను కొనసాగించాలని సూచించారు. సమీకృత జల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బోధన్, అర్బన్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు, ఎక్సైజ్, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. నిజామాబాద్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి నిజామాబాద్ మీదుగా గంజాయిని ఆడపాదడపా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నారని, గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలున్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులతో కలిసి నిరోధక చర్యలు చేపట్టాలని సూచించారు. తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు.
గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా కోర్టులకు సమగ్ర ఆధారాలు సమర్పించాలన్నారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ప్రాజోలం నిల్వలను గుర్తించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు వివరిస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి అలవాటు పడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి కోసం జిల్లా కేంద్రంలో డీ-అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ తన చాంబర్లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో పాటు, ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ విశాల్‌తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ కేంద్రం ఏర్పాటు దిశగా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు . సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ సూపరింటెండెంట్ డీసీబీ నాయక్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బీ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.