బోధన్, నవంబర్ 1: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ఈ నెల 6నుంచి చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. శుక్రవారం ఆయన ఇంటింటి కుటుంబ సర్వే నేపథ్యంలో బోధన్ పట్టణంతోపాటు మండలంలోని లంగ్డాపూర్ గ్రామంలో పర్యటించారు. రాకాసిపేట్తో పాటు లంగ్డాపూర్ గ్రామంలో అధికారులు, సిబ్బంది ఇండ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలు, పాటిస్తున్న పద్ధతులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మూడు రోజుల్లోపు హౌసింగ్ లిస్ట్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. బోధన్ పట్టణ శివారులో చేపట్టిన ఏటీసీ భవన సముదాయ నిర్మాణం పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇక్కడి ఏటీసీ భవనం నిర్మాణం పనులు బేస్మెంట్ వరకు మాత్రమే పూర్తికావడంపై అధికారులను ప్రశ్నించారు. పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. సొంత భవనాలు అందుబాటులోకి వచ్చేవరకు ఏటీసీ తరగతులను ఐటీఐ భవనాల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్ ఉన్నారు.
కామారెడ్డి, నవంబర్ 1 : ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని వాసవీ హైస్కూల్ సమీపంలోని వార్డులో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు.సర్వేలో ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఇంటిలోని సమాచారాన్ని సేకరించిన అనంతరం ఇంటి తలుపుపై స్టిక్కర్ అంటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఇందూప్రియ, కౌన్సిలర్ నరేందర్, అధికారులు పాల్గొన్నారు.