ఖలీల్‌వాడి, జూలై 20 : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు స్థానికంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. కలెక్టరేట్లో నీటి పారుదల, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, ఉద్యాన తదితర శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులు స్థానికంగా ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. వర్షాలకు నిండిన చెరువులు, వాగులు, కాలువల పరిస్థితి, పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద, రిజర్వాయర్ నీటిమట్టం, పంటల నష్టం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో చర్యలు చేపట్టాలన్నారు. చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు. శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నీటిపారుదల శాఖ ఎస్ఈలు బద్రీనారాయణ, శ్రీనివాస్, డీఈ ప్రవీణ్, సీపీవో బాబూరావు, వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, డీపీవో జయసుధ, పశుసంవర్ధశాఖ సంయుక్త సంచాలకుడు జగన్నాథాచారి, పంచాయతీరాజ్ ఈఈలు భావన్న, శంకర్ పాల్గొన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ఆర్.మధుసూదన్‌రావు తెలిపారు. వర్షాలతో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 08462-221403కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
కలెక్టరేట్లో మొక్కలు నాటిన కలెక్టర్
హరితహారంలో భాగంగా కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు గురువారం అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా నిర్ణీత గడువులోగా మొక్కలు నాటాలని సూచించారు.
ఎన్నికలపై అవగాహన కోసం ప్రచార రథాలు
ఎన్నికలు, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సంచార ప్రచార రథాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కలెక్టరేట్ వద్ద జెండా ఊపి గురువారం ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో రెండు చొప్పున ప్రచార వాహనాల ద్వారా ఈవీఎం, వీవీ పాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ఎంతో కీలకమైందని, ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.