కామారెడ్డి, సెప్టెంబర్ 11 : గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని ఎస్పీ సింధూశర్మతో కలిసి బుధవారం పరిశీలించారు. పట్టణంలోని స్టేషన్ రోడ్, గంజ్ రోడ్, పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా కొత్తబస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు, శోభాయాత్రకు ఆటంకం కలుగకుండా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ అధికారులు ఉన్నారు.