కామారెడ్డి, ఆగస్టు 24 : ప్రతి భవన నిర్మాణరంగ కార్మికుడు కార్మిక శాఖలో తమ పేరును నమోదు చేసుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శనివారం భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మిక చట్టం ప్రకారం భవన, ఇతర నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం విలువలో ఒక శాతం సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు చెల్లించాలని సూచించారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులు ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలని ఆదేశించారు.ప్రతి భవన నిర్మాణ కార్మికుడు 110 రూపాయలు చెల్లించి కార్మికశాఖలో పేరు నమోదు చేసుకోవాలని, తద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు. సహజ మరణం పొందితే రూ.లక్షా 30 వేలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.6.30 లక్షల వరకు వారి కుటుంబం లబ్ధి పొందవచ్చని తెలిపారు.
పాక్షిక వైకల్యం కలిగితే రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు,కార్మికుడి కూతురు వివాహం కోసం రూ.30వేలు, ప్రసూతి సహాయ పథకాలకు రూ.30 వేల వరకు పొందవచ్చని వివరించారు. జిల్లా అధికారులు వారి వారి శాఖల్లో నిర్మాణ పనులు జరిగినప్పుడు పని ప్రదేశాలను పరిశీలించి, కార్మికులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, సీపీవో రాజారాం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి,అన్ని ఇంజినీరింగ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.