వ్యవసాయ శాఖలో వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారుల పరస్పర దూషణలు, ఫిర్యాదులతో మూమూళ్ల పర్వం బయట పడింది. ఏకంగా జిల్లా అధికారిపైనే మండల స్థాయి అధికారి ఫిర్యాదు చేయడం, అదే అధికారిపై పలువురు ఫర్టిలైజర్ షాపుల యజమానులు తీవ్ర ఆరోపణలతో డీఏవోకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మొత్తంగా రైతుల సంక్షేమం కోసం పని చేయాల్సిన అధికారులు ఇలా రోడ్డున పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో తలెత్తిన విషయంతో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు వ్యవసాయ శాఖ కమిషనర్ దాకా వెళ్లింది. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగు పరుస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించి 24 గంటలు కాకముందే ఈ వివాదం బయటకు వెలుగు చూడడం గమనార్హం. రైతాంగానికి మేలు చేసేలా పని చేయాలని, యాసంగికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని మంత్రి హితబోధ చేసి వెళ్లిన మర్నాడే.. వ్యవసాయ శాఖలో వసూళ్ల ఆరోపణలు చెలరేగడం విశేషం.
– నిజామాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సెప్టెంబర్ 26 నుంచి డిజిటల్ క్రాప్ సర్వే మొదలైంది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించి ఫొటోలను సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే, ఇప్పటికే తీవ్ర పనిభారంతో సతమతమవుతున్న ఏఈవోలు డిజిటల్ క్రాప్ సర్వేను విస్మరించా రు. రెంజల్ మండలంలోని 5 క్లస్టర్లలో పని చేస్తున్న ఏఈవోలు కూడా సర్వే చేప ట్టలేదు. ఇదే విషయాన్ని ఏవో.. జిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు రూపంలో పెట్టారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కారణంగా స్థానిక ఏవో పెట్టిన మెసేజ్‌పై ఏఈవోల్లో చర్చ జరిగింది. పని ఒత్తిడిపై శనివారం కలెక్టరేట్లో పలువురు ఏఈవోలు నిరసన వ్యక్తం చేసిన సమయంలో ఏవో ఫిర్యాదుపైనా చర్చ జరిగింది. ఇదే విషయంపై మంత్రి జూపల్లి సోమవారం పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత పలువురు వ్యవసాయాధికారులు అక్కడే ఉన్న కలెక్టర్‌ను కలిసి ఏఈవోల బాధలను చెప్పుకున్నారు. ఏవో ఫిర్యాదును కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే రెంజల్ కూడా తిరుగుబావుట ఎగురవేశారు. దీనంతటికీ ఓ కీలక అధికారే కారణమని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యవసాయాధికారిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు, కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇందులో వ్యవసాయ శాఖలోని వసూళ్ల పర్వానికి సంబంధించిన పలు అంశాలు ఉండడం దుమారం రేపుతున్నది. మరోవైపు బోధన్ డివిజన్లో కొంత మంది ఏఈవోలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఒక అధికారి ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీకి ప్రాయోజిత సేవలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదే డివిజన్లోని మరో ఏఈవోపైనా సబ్సిడీ విత్తనాలను మాయం చేశారన్న అవినీతి ముద్ర ఉంది. రైతుబీమా దరఖాస్తుల స్వీకరణ సందర్భంలో ఒక ఏఈవో దరఖాస్తుకు రూ.250 చొప్పున వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయ శాఖ బోధన్ డివిజన్ పరిధిలో తలెత్తిన ఈ వ్యవహారం యంత్రాంగాన్ని కుదిపేస్తున్నది. మరోవైపు, డీఏవో వాజిద్ హుస్సేన్ తన సుదీర్ఘ కాలం బోధన్ డివిజన్‌లోనే విధులు నిర్వర్తించడం విశేషం. ప్రస్తుతం రెంజల్ మండలానికి ప్రత్యేకాధికారి కూడా ఆయనే కావడం గమనార్హం.
రెంజల్, అక్టోబర్ 1: మండల వ్యవసాయశాఖ అధికారి వేధింపులను తట్టుకోలేక పోతున్నామని మండల సీడ్స్, పెస్టిసైడ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఆరోపించారు. మండలంలోని బోర్గాంలో వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఏవో లక్ష్మీకాంత్‌రెడ్డి తనిఖీల పేరుతో హడావుడి చేయడమే కాకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆయన వేధింపులను తట్టుకోలేక కలెక్టర్, ఎమ్మెల్యే, జేడీఏ, ఏడీఏకు ఫిర్యాదు చేశామని అసోసియేషన్ బాధ్యులు కార్తిక్, ఆరిఫ్, మోహన్‌రెడ్డి, శివకుమార్, నాగరాజు తెలిపారు.
నేను ఎలాంటి తపూ్పు చేయలేదు. అనవసరంగా కొంత మంది నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఏఈవోలకు చెప్పా. వారు నిరాకరించిన విషయాన్ని మాత్రమే డీఏవోకు వాట్సప్ గ్రూపులో నివేదించా. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని చేస్తున్న నన్ను ఈ పరిణామాలు ఎంతగానో ఇబ్బందికి గురి చేశాయి.
– పి.లక్ష్మీకాంత్‌రెడ్డి, ఏవో, రెంజల్
ఏఈవో, ఏవోలకు మధ్య జరిగిన వివాదం మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు పూర్తి వివరాలతో నివేదించాను.
– వాజిద్ హుస్సేన్, జిల్లా వ్యవసాయాధికారి