కామారెడ్డికి పెద్ద సారొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి నుంచి తాను పోటీ చేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన.. సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించారు. బాన్సువాడ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండ నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్‌లో గణేశ్ గుప్తా, బోధన్‌లో షకీల్, జుక్కల్‌లో షిండే, ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్‌కు అవకాశం కల్పించారు. జిల్లాలో నేరుగా గులాబీ బాస్ పోటీ చేస్తుండడం, సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం మిన్నంటింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. క్లీన్‌స్వీప్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రే స్పష్టం చేయడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వరుసగా ఈ ప్రాంతంలో గులాబీ జెండానే పాగా వేస్తూ వస్తున్నది. 2009లో టీడీపీ పార్టీ నుంచి గంప గోవర్ధన్ గెలిచారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. స్వరాష్ట్రంలో 2014, 2018లోనూ బీఆర్ఎస్ పార్టీయే విజయాన్ని నమోదు చేసింది. ముచ్చటగా నాలుగోసారి ఈ ప్రాంతంలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది. కామారెడ్డి నుంచి సీఎం పోటీ చేయనున్నట్లుగా ప్రకటన వెలువడిన క్షణం నుంచి స్థానిక ప్రజలు, గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వెల్ కమ్ టు కేసీఆర్ సార్… అంటూ ఫ్లెక్సీలు పెట్టి పటాకులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కామారెడ్డి నియోజకవర్గానికి విడదీయరాని అనుబంధం ఉంది. కేసీఆర్ తల్లిగారు వెంకటమ్మది కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామం ఒకప్పటి పోసానిపల్లి కావడం విశేషం.
కేసీఆర్ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీలో వణుకు…
కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటన చేయడంతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు మొదలైంది. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోని రైతులను, సామాన్య జనానికి అబద్ధపు, కల్పిత అంశాలతో మభ్యపెట్టి వారిలో విష బీజాలు నాటిన వారందరికీ కేసీఆర్ చేసిన ప్రకటనతో ముచ్చెమటలు పుడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ వస్తుండడంతో ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో సందడి నెలకొనగా కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల్లో మాత్రం స్తబ్ధత ఆవరించింది. కనీసం నోరు మెదిపేందుకు సైతం సాహసం చేయని దుస్థితి ప్రతిపక్ష పార్టీలకు ఎదురవుతున్నది. స్వరాష్ట్రంలో కామారెడ్డి జిల్లా రూపురేఖలు సమూలంగా మార్పునకు నోచుకున్నాయి. కేసీఆర్ ఆశీస్సులతోనే కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. జిల్లా పరిపాలన వ్యవస్థకు కొత్త రూపుగా సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవనాలు నెలకొల్పారు. దీనికి తోడుగా కామారెడ్డి వాసుల చిరకాల వాంఛ మెడికల్ కాలేజీ సైతం మంజూరు కాగా తరగతులు సైతం ఈ ఏడాది నుంచే షురూ అవ్వబోతున్నాయి. గతం కన్నా మెరుగైన స్థితిలో కామారెడ్డి అభివృద్ధి పరుగులు తీయగా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రాంతంపై దృష్టి సారించడంతో ఊహించని అభివృద్ధి సాకారం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ పూర్వీకులది ఇక్కడే…
సీఎం కేసీఆర్ తల్లి వెంకటమ్మ పుట్టింది, పెరిగింది అంతా కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం పోసానిపల్లి గ్రామం. ఇప్పుడు ఈ గ్రామాన్ని కోనాపూర్‌గా పిలుస్తుంటారు. అప్పర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్‌కు కూత వేటు దూరంలోనే ఈ గ్రామం ఉంది. ప్రస్తుతం వెలసిన గ్రామానికి మునుపు అప్పర్ మానేరులో పోసానిపల్లి మునిగింది. చాలా మంది పొలాలు, ఇండ్లు మునిగి పోవడంతో కొంత మంది దగ్గర్లోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. మరికొంత మంది వేరే చోట భూములు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇలా కేసీఆర్ తల్లిదండ్రులు సైతం పోసానిపల్లిని వదిలి చింతమడకకు వెళ్లారు. వాస్తవానికి రాఘవరావు స్వగ్రామం సిద్ధిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. పోసానిపల్లికి ఆయన ఇల్లరికం వచ్చారు. ఇక్కడే రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు జన్మించారు. వీరిలో ఇద్దరి వివాహాలు సైతం ఇదే గ్రామంలో జరిగినట్లుగా వారి కుటుంబీకులు, స్థానిక ప్రజలు చెబుతారు. చింతమడకలోనే కేసీఆర్ జన్మించారు. ఇప్పటికీ కేసీఆర్ తల్లిగారి తరపు వారు ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. పలువురు వ్యాపార, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డారు. గ్రామంతో సంబంధాలను వదులుకోలేదు. కేసీఆర్‌తోనూ ఇక్కడి కుటుంబాలకు సత్సంబంధాలు ఉన్నాయి. సుమారు 80-85 ఏండ్ల కిందట సీఎం కేసీఆర్ తల్లిదండ్రులు ఈ ప్రాంతంలో నివసించారు. అప్పటికీ కేసీఆర్ జన్మించలేదు. కేసీఆర్ తల్లి వెంకటమ్మది పోసాన్పల్లి(కోనాపూర్). వెంకటమ్మ తరపు కుటుంబంలో మగ పిల్లలు లేరు. పెళ్లి చేసేటప్పుడే అల్లుడిని ఇల్లరికం అడిగారు. రాఘవరావు(కేసీఆర్ తండ్రి) మోహినికుంట నుంచి ఇక్కడికి ఇల్లరికం వచ్చారు. ఇక్కడే సొంతింట్లోనే 1930 వరకు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నట్లుగా ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
భౌగోళిక స్వరూపం ఇదీ…
కేసీఆర్ పోటీ చేయబోతున్న కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం జనాభా 2011 ప్రకారం 3లక్షల 2వేల 634 మంది ఉన్నారు. ఇందులో పురుషులు లక్షా 15వేల 104 మంది, స్త్రీలు లక్షా 22వేల 836 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2లక్షల 27వేల 867 మంది ఓటర్లున్నారు. పోలింగ్ బూత్‌లు 266 ఉండగా లక్షా 10వేల 56 మంది పురుష ఓటర్లు, లక్షా 17వేల 783 మంది స్త్రీ ఓటర్లున్నారు. 28 మంది థర్డ్ జెండర్ ఓటు హక్కును కలిగి ఉన్నారు.