ఖలీల్వాడి, అక్టోబర్ 16: రేవంత్రెడ్డి సర్కార్ మాదిగ జాతిని వంచించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. నమ్మకద్రోహానికి గురైన మాదిగలు రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొందని, ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు.
రాష్ర్టాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఆదేశాలు జారీ చేసిందని, అయినా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణలోని మాలల ఒత్తిడితో రేవంత్రెడ్డి సర్కారు వర్గీకరణను తొక్కి పెట్టేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటాల్లో పాల్గొని అందరినీ నమ్మించాడని, ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం స్వయంగా అన్ని పోరాటాలలో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి పాల్గొని అందరినీ నమ్మించారని ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. దివ్యాంగుల పింఛన్లను రూ. 6 వేల వరకు పెంచుతామని చెప్పి పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. యావత్ మాదిగ జాతి మరో పోరాటానికి సిద్ధమవుతున్నదని, ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు.