డిచ్పల్లి/ఇందల్వాయి, ఆగస్టు 15 : రైతులకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆయన రైతుపక్షపాతి అని కొనియాడారు. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కష్టాసుఖాలు తెలిసిన నాయకుడని అన్నారు. రైతులకు అందిస్తున్న సేవలను ఎప్పటీకీ మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ అసది రవీందర్, ఎంపీటీసీ కొత్తూరు మానసా సాయి, ఖిల్లా రామాలయ చైర్మన్ మాహేందర్, వీడీసీ సభ్యులు వరాల సాయిలు, తోట చిన్న సాయిలు, సీఈవో కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రుణమాఫీతోపాటు డిచ్పల్లి మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయడంపై అన్నదాతలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, విద్యావేత్తలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాల హామీని ఎమ్మెల్యే బాజిరెడ్డి నిలబెట్టుకున్నారని, మండల ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, నాయకులు నల్లవెల్లి సాయిలు, ఒడ్డెం నర్సయ్య, డాక్టర్ షాదుల్లా, అంబర్‌సింగ్ రాథోడ్, పార్టీ జనరల్ సెక్రటరీ నల్ల హరికిషన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు విఠల్‌రాథోడ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రమోద్, కార్మికవిభాగం అధ్యక్షుడు విశ్వప్రకాశ్, ఎంపీటీసీలు రామకృష్ణ, పోతర్ల రవి, గిరి, యూత్ అధ్యక్షుడు అమీర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు నయీం పాల్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. అన్నదాతల శ్రేయస్సు కోరేనాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని కొనియాడారు. కార్యక్రమంలో సొసైటీ వైస్‌చైర్మన్ మారుతి, డైరెక్టర్లు మల్లారెడ్డి, ముత్తెన్న, దాసు, ఆరెట్టి రఘు, డాక్టర్ తాళ్ల రాజు, చందర్‌నాయక్, రామారెడ్డి, సుధాకర్, నామాల గంగాధర్, సీఈవో రతన్, రైతులు పాల్గొన్నారు.
మోర్తాడ్: తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ జేసుట్ల రైతులకు అన్ని రకాలుగా లాభమయింతున్నది. పంటలకు నీరు, కరెంటు ఢోకాలేదు. పంట పెట్టుబడి ఇస్తుండు. రైతుబీమా ఇస్తుండు. ఎరువులు దొరుకుతున్నాయి. ఆఖిరికి రుణమాఫీ కూడా ఇయ్యవట్టె. ఇంతకన్నా ఇంకేం గావాలే. రైతులకోసం ఇంతగనం చేస్తున్న కేసీఆరే మళ్లీ సీఎం గావాలే..
– సుభాష్, రైతు, మోర్తాడ్
కమ్మర్పల్లి: రైతులకు కేసీఆర్ సారు అందిస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎవ్వరూ ఇస్తలేరు. రైతుకోసం ఎంత దాకైనా వెళ్లే కేసీఆర్ సారు.. రుణాలను తప్పకుండా మాఫీ జేస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉండేది. ఇప్పుడు అదే నిజమైంది. ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ నుంచి రైతులను విడదీయలేరు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతుకు అండగా ఉంటున్న ఘనత కేసీఆర్‌దే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడు.
-కమ్మరి భూమేశ్వర్, రైతు, కమ్మర్పల్లి
వేల్పూర్: సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నుంచి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు కష్టాలన్నీ దూరమయ్యాయి. ఇంత మంచి ప్రభుత్వాన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు.
-రాజారెడ్డి, మోతె, వేల్పూర్ మండలం
బోధన్ రూరల్: సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టసుఖాలు తెలుసు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలాగా రుణామాఫీ చేసిండు. పంటలకు పెట్టుబడి ఇస్తుండు. పండించిన పంటలను కొనుగోలు చేస్తుండు. ఇప్పుడు రుణమాఫీ చేసిండు. సమైక్య పాలనలో వ్యవసాయం చేయాలంటే భయపడేవాళ్లం. నీళ్లు, కరెంటు, డబ్బులు లేక నానా గోస పడేటోళ్లం. కానీ కేసీఆర్ వచ్చినంక వ్యవసాయానికి మించిన పని లేదని గౌరవంగా బతుకుతున్నం.
-గణేశ్పటేల్, రైతు, బండార్పల్లి
వర్ని : ఎంత కష్టమైనా రుణాలు మాఫీ చేస్తున్నారు. రైతులు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇది సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం. కష్టాల్లో మాకు అండగా నిలబడుతున్న కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-అన్నం సాయిలు, రైతు, జలాల్పూర్
డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రుణమాఫీ చేసిన దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన అందిస్తున్న పథకాలతోనే రైతులు నేడు అనందగా ఉంటున్నారు. ప్రజలకోసం నిరంతరం పాటుపడుతున్నడు. రైతు బిడ్డగా ఆయనకు వ్యవసాయం గురించి, అన్నదాల కష్టాల గురించి తెలుసు. అందుకే రైతును రాజు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
-శ్రీనివాస్ రెడ్డి, మెంట్రాజ్‌పల్లి
డిచ్పల్లి: పంటల సాగుకోసం 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలకు అండగా ఉన్నాడు. రైతుబందు, రైతుబీమా ఇస్తున్నాడు. రైతు ఆత్మహత్యలు లేవు. కరెంటు సావులు లేవు. అందుకే రైతుమెచ్చిన రాజుగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.
-మొచ్చ గోపాల్, ఇందల్వాయి
ఎల్లారెడ్డి రూరల్: రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా కేసీఆర్ సార్ చూసుకుంటున్నడు. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబీమా, ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నడు. రైతువేదికలు కట్టిచ్చి ఎటువంటి సమస్యలు రాకుండా అవగాహన కల్పిస్తుండు. ఇప్పుడు రుణమాఫీ చేసిండు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా రైతులను ఇంతగానం పట్టించుకోలేదు.
– నర్సింహులు, రైతు, ఎల్లారెడ్డి