నిజామాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ గురువారం ఫోన్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం నుంచి కలియదిరుగుతున్న మంత్రితో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఉభయ జిల్లాల్లో పోచంపాడ్, నిజాంసాగర్ ప్రాజెక్టుల వివరాలతోపాటు వరద కల్లోలం నేపథ్యంలో ప్రజల బాగోగులపై ఆరా తీశారు. గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల ఉదయం నుంచి తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. సాయం త్రం భీమ్గల్కు వచ్చిన సమయంలోనే సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో అక్కడే పోలీసు వాహనంలో మాట్లాడారు. సహాయక చర్యల వివరాలను సీఎంకు మంత్రి వివరించారు. బాల్కొండ నియోజకవర్గంలో కుండపోత వానలు కురుస్తున్నందునా.. ప్రజలకు అండగా నిలువాలని సూచించారు. మీకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ మంత్రి వేముల అప్రమత్తం చేస్తున్నారు. వానల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖలతో సమన్వయం చేస్తూ ముందుకెళ్లారు. తాజా పరిస్థితుల ఆధారంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలను తీర్చడంలో మంత్రి వేముల చొరవ చూపారు.