ఆర్మూర్, నవంబర్ 2 : ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆర్మూర్‌కు రానున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డులో 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఓ ప్రైవేట్ వెంచర్లో సుమారు లక్ష మంది ప్రజల కూర్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకొని ఆ ర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సభకు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. లక్ష మంది జనం స్వచ్ఛందంగా తరలిరానున్న నేపథ్యంలో వేదిక, వీఐపీలు, మీడియా, మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్ పరిశీలించారు.
ఆర్మూర్‌లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార సభకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు ఆర్మూర్ పట్టణంలో నుంచి ప్రజలు తరలిరానున్నారు. సుమారు లక్ష మంది వరకు సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పా ట్లు చేశారు. గూండ్ల చెరువు ప్రాంతంలో పట్టణం నుం చి వచ్చే వారికి, మాక్లూర్ నుంచి వచ్చే వారికి నిజామాబాద్ రోడ్డులో, ఆలూర్ వైపు నుంచి వచ్చేవారి కోసం హన్మాన్ ఆలయ ప్రాంతంలో, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల నుంచి వచ్చే ప్రజల కోసం ఆలూర్ బైపాస్ రోడ్డులో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను సైతం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన సతీమణి స్వయంగా కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారస్తులను కలుస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. మరోవైపు నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్, ఆలూర్తో పాటు పట్టణంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వారం రోజులుగా ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికలను అందజేసి ఆహ్వానిస్తున్నారు.
ఆర్మూర్, నవంబర్ 2 : ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో శుక్రవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో ఏర్పాట్లను ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత గురువారం రాత్రి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. సభా స్థలి, ప్రాంగణంలో గ్యాలరీలను పరిశీలించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు గంగామోహన్‌చక్రు, సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, మోత్కురి లింగాగౌడ్, పండిత్ ప్రేమ్, గంగాధర్, అంజాగౌడ్, చందు, రవిగౌడ్ ఉన్నారు.