కల్లాల నిండా నీళ్లు.. రైతుల కంట కన్నీళ్లు.. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేశాయి. చేతికందిన పంటలను దారుణంగా దెబ్బతీశాయి. అటు నేలవాలిన పంటలు, ఇటు ధాన్యం కుప్పల్లో వస్తున్న మొలకలు చూసి రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఈ కష్టకాలంలో సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారు. రైతులు ఏమాత్రం ఆందోళనకు గురికావొద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని ప్రకటించారు. తద్వారా తమది రైతు ప్రభుత్వమని మరోసారి చాటి చెప్పారు. ఆరుగాలం పడిన శ్రమ వర్షార్పణమైందని ఆందోళనలో ఉన్న రైతాంగానికి ముఖ్యమంత్రి తాజా ప్రకటన భారీ ఊరటను కల్పించింది. మరోవైపు, ఇదే సమయంలో బీజేపీ చిల్లర రాజకీయాలకు తెర లేపింది. కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించాల్సింది పోయి స్వార్థ రాజకీయం కోసం ఆందోళనలకు దిగడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సారు తమకు అండగా నిలుస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
నిజామాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిండు వేసవిలో దండిగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ఆగం చేశాయి. చేతికి వచ్చిన పంటను రేపో మాపో అమ్ముకుందామనుకునే లోపే వడ గండ్ల వానలు నిండా ముంచాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు కన్నీరే మిగిలింది. ఈ దుస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచారు. రైతును ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆందోళనతో ఉన్న కర్షకులకు ఒకింత ఊరట కలిగింది. మరోవైపు, కొనుగోళ్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద సంఖ్యలో ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌లో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని యంత్రాంగం సేకరించింది. ఇదిలా ఉంటే, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది భారతీయ జనతా పార్టీ తీరు. ఓ వైపు పంట నష్టపోయిన దుఃఖంలో ఉన్న రైతుకు సాంత్వన చేకూర్చాల్సిన బాధ్యత గల రాజకీయ పార్టీ .. ఏకంగా వారిని తమ స్వార్థ రాజకీయం కోసం వాడుకుం టుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. రాష్ట్ర సర్కారు ఒకడుగు ముందుకేసి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం తడిసిన ధాన్యం విషయంలో ఖరాకండిగా నిబంధనలను చూపి కొర్రీలు పెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నష్టాలను భరించి రైతుకు మేలు చేసేందుకు కృషి చేస్తోంది. ఇంతటి ఘనకార్యాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ తలపిస్తే బీజేపీ మాత్రం ఆయా చోట్ల కుటిల రాజ కీయాలకు తెర లేపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు రైతులపై ప్రేముంటే సాయం ప్రకటించాలే కానీ చిల్లర మల్లర రాజకీయాలతో రైతును ఇబ్బంది పెట్టడం ఏంటంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చకచకా కొనుగోళ్లు..
కామారెడ్డి జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న అంచనాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం తగు ఏర్పాట్లు చేసింది. 347 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే 313 చోట్ల తెరిచారు. 170 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఊపందుకుంటున్నది. ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. దాదాపుగా 6 వేల మంది రైతుల నుంచి రూ.100 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. ఎక్కడా గన్నీ సంచుల కొరత లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 5 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వడ్ల గింజలు రాలిపోవడం మూలంగా హార్వెస్టింగ్ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే, తడిసిన ధాన్యం విషయంలో మాత్రం ఎలాంటి సాకులు చెప్పకుండా ధాన్యాన్ని కొనేందుకు యంత్రాంగం సుముఖత వ్యక్తం చేస్తోంది.
బీజేపీ చిల్లర రాజకీయం..
రైతు పేరిట రాజకీయం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఒకడుగు ముందే ఉంటుంది. కానీ అదే రైతులకు సాయం చేయడంలో మాత్రం కేంద్రంలోని బీజేపీ వెనుకడుగు వేస్తుంది. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసి బద్నాం చేయడం మినహా ప్రజలకు చేసే మంచి పనంటూ ఇసుమంతైనా లేదు. అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రైతాంగాన్ని ఆదుకోవాలన్న సోయి కేంద్రానికి లేకుండా పోయింది. చాలా చోట్ల వరి కోతకు ముందే చేతికొచ్చిన పంట నేల రాలింది. కొన్ని చోట్ల కోసిన వరి ధాన్యం కుప్పలన్ని వరదలో కొట్టుకుపోవడం, తడిసి ముద్దవ్వడంతో రైతులు లబోదిబోమనే దుస్థితి ఏర్పడింది. బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్ట వివరాలను సేకరించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, బీజేపీ తమ రాజకీయ యావతో రైతులను గందరగోళపరిచి కష్టకాలంలో తమ చుట్టూ తిప్పుకునేందుకు మైండ్‌గేమ్ ఆడుతున్నది. కామారెడ్డిలో మే 2న రైతుధర్నా పేరుతో బీజేపీ డ్రామా చేసింది. కొత్తగా మే 4న కామారెడ్డి గంజ్ ప్రాంతం నుంచి ర్యాలీ పేరిట మరో నాటకానికి తెరలేపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా సాయం చేయాలంటూ కర్షకులు బీజేపీని డిమాండ్ చేస్తున్నారు.
జోరుగా సేకరణ..
యాసంగిలో భారీగా వరి సాగైంది. దీంతో నిజా మాబాద్ జిల్లాలో 482 ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. 456 సెంటర్లను ఇప్పటికే ప్రారంభించగా, 425 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వర్షాలతో సంబంధం లేకుండా పటిష్ట ఏర్పాట్ల మధ్య ధాన్యాన్ని సేకరిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ఫంక్షన్ హాళ్లు, ప్రత్యేక షెడ్లలో కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 29 వేల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. మొత్తం 2.45 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి మొత్తం విలువ సుమారుగా రూ.500 కోట్లు ఉంటుంది. సరాసరి రోజుకు సగటున నిజామాబాద్ జిల్లాలో 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా 19 వేల మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ద్వారా అత్యధికంగా 2 లక్షల మెట్రిక్ టన్నులు, మెప్మా సెంటర్ల ద్వారా 910 మెట్రిక్ టన్నులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 6వేల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యాన్ని సేకరించారు. లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నారు.
రైతుల పక్షపాతి సీఎం
ఐదున్నర ఎకరాల్లో అరిపంట ఏసిన. అడ్లు ఎండబెట్టి కుప్పపోసినం. గీ కాలంల మన్నువడ. రైతుల ఎంట పడ్డది. ఆనలు కొట్టుడు కొడితే అడ్ల కుప్పలల్లకెళ్లి నీళ్లు పారుతున్నయ్. మొలకలు కూడా అత్తున్నయి. అడ్లు తడిసినయని మస్తు రందీ అయితుంది. గనీ కేసీఆర్ సారు.. మొత్తం తడిసిన అడ్లు గూడా కొంటమని చెప్పిన మాట మంచిగ అన్పిస్తున్నది. ఆయన రైతుల పక్షపాతి. గా సారు మంచిగుంటే రైతులకు మంచిగుంటది.
-దుమాలే శంకర్రావు, రైతు హెగ్డోలి, కోటగిరి
కేసీఆర్ ప్రకటనతో ధైర్యం వచ్చింది..
కోటగిరి, మే 3: మాకు 18 ఎకరాలు వరి పంట ఉంది. కోతలు కాగానే అకాల వర్షాలు మొదలైనయి. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. ఏం చేయాలో తెలియక భయం భయంగా ఉన్నాం. తడిసిన ధాన్యాన్ని కొంటాం, రైతులు ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ సార్ చెప్పిన మాట విని ధైర్యం వచ్చింది. రైతుల బాధలు తెలిసిన గొప్ప మనిషి కేసీఆర్.
– కాలే సంపత్, రైతు కొల్లూర్, ఉమ్మడి కోటగిరి మండలం
బీజేపీ నాయకులకు రైతుల బాధలు పట్టవు..
ఎక్లాస్పూర్ శివారులో మూడెకరాల్లో వరి సాగుచేసిన. కోతలు కోసి వడ్లు ఆరబెట్టగా అకాల వర్షాలతో తడిసిపోయాయి. కొన్నింటికి మొలకలు కూడా వచ్చినయ్. బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. కేవలం పేపర్లో ఫొటోల కోసం లేనిపోని మాటలు చెప్పి చేతులు దులుపుకొంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నది. వర్షానికి వరి ధాన్యం తడిసి మొలకెత్తిన కూడా వడ్లు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంచి మనసున్న మా రాజు సీఎం కేసీఆర్.
– బేగరి మారుతి, రైతు, కోటగిరి
మనసున్న మారాజు కేసీఆర్ సార్
సీఎం సార్ మనసున్న మారాజు. అకాల వర్షాలకు రైతులు పడుతున్న బాధలు చూసి వడ్లు తడిసినా కొంటామని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని చెప్పి రైతుల్లో ధైర్యం నింపారు. అకాల వర్షాలకు నష్టపోయిన పంట ఎకరాకు రూ. 10 వేలు ప్రకటించారు. ఆపత్కాలంలో రైతుల దుఃఖం, కష్టం పంచుకోవాలని రైతులకు అండగా నిలిచారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-బేగరి గంగామణి, మహిళా రైతు, కోటగిరి
రైతుల బాధలు తెలిసిన గొప్ప సీఎం కేసీఆర్..
నాకు ఆరు ఎకరాలు పొలం ఉంది. నేను కోతలు కోసి 25 రోజులు గడిచిపోయింది. కానీ పొతంగల్ సహకార సంఘం సిబ్బంది నిర్లక్ష్యంతోనే ధాన్యం తడిసిపోయింది. 25 రోజుల నుంచి గన్నీ బస్తాల కోసం వాళ్ల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కానీ రైతుల బాధలు తెలిసిన గొప్ప సీఎం కేసీఆర్ సార్. రైతులు పడుతున్న కష్ట్టాలను గుర్తించి అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మాకు ధైర్యం వచ్చింది.
-భీంరావు, రైతు, తిర్మలాపూర్, కోటగిరి మండలం