మోర్తాడ్/రెంజల్, సెప్టెంబర్ 5: మహోగ్ర రూపం దాల్చిన గోదావరి శాంతించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు నిలిచి పోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నిన్నటిదాకా ఉరకలెత్తిన గోదావరి ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్నది. నీట మునిగిన పురాతన శివాలయ శిఖరం వరద తగ్గడంతో బయట పడింది. కందకుర్తి వద్ద గల వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో మూడు రోజులుగా మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, వరద తగ్గిపోవడంతో గురువారం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. అంతర్రాష్ట్ర మార్గంలో వాహనాలను అనుమతిస్తున్నామని బోధన్ రూరల్ సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.
పోచంపాడ్ వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసేశారు. ఇటీవలి వర్షాలకు 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో రాగా, 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వరద తగ్గిపోవడంతో గేట్లను మూసి వేశారు. గురువారం సాయంత్రానికి 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1089 అడుగులు( 73.369 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. 8,867 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. ఈ సీజనల్ ఇప్పటిదాకా ఎస్సారెస్పీకి 141.314టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, 77.245 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
కందకుర్తి వద్ద నదిలో బయటపడిన పురాతన శివాలయ శిఖరం