ఆర్మూర్‌టౌన్, మార్చి 22: రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆ పార్టీని గద్దె దింపే వర కు బాధ్యత తీసుకుంటామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పట్టణంలో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ, జేఏసీ సభ్యులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ సభ్యుడు నవీన్‌రెడ్డి మాట్లాడు తూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుత మార్గంలో ఆందోళన చేస్తున్న రైతు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డి.. ప్రజ లు, రైతులపై హామీల వర్షం కురిపించి, ఇప్పుడు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ ఈ నెల 24న జగిత్యాల రైతుఐక్యవేదిక పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి, కేవలం 40శాతం మా త్రమే చేసిందని మండిపడ్డారు. అన్ని పంటలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం సన్నాలకే మాత్రమే ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాకు పసుపు బోర్డు తెచ్చినా రూ.15 వేల మద్దతు ధర ఇప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సమావేశంలో రైతు జేఏసీ నాయకులు ఇట్టెడి లింగారెడ్డి, వి.ప్రభాకర్, నక్కల భూమారెడ్డి, రమేశ్ రెడ్డి, దేవారాం తదితరులు పాల్గొన్నారు.