నందిపేట్, ఏప్రిల్ 18: న్యుమోనియా ఇద్దరు చిన్నారులను కాటేసింది. అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. గంటల వ్యవధిలోనే చెల్లెలి కూతురు, అక్క కుమారుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలంలో శుక్రవారం చోటు చేసుకున్నది. నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లకు గతంలో వివాహాలు జరిగాయి. అక్క లావణ్యను బజార్కొత్తూర్ వాసి సాయినాథ్కు, చెల్లెలు శ్యామలను సీహెచ్.కొండూర్కు చెందిన గోపికి ఇచ్చి వివాహం జరిపించారు.
గోపి, శ్యామల దంపతుల కుమార్తె నవ్యశ్రీ (6 నెలలు), లావణ్య, సాయినాథ్ దంపతుల కుమారుడు గణేశ్ (8 నెలలు) నాలుగైదు రోజులుగా న్యుమోనియాతో బాధ పడుతున్నారు. చిన్నారులకు దవాఖానలో చికిత్స చేయించారు. అయితే, నవ్యశ్రీ కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో శుక్రవారం మళ్లీ అస్వస్థతకు గురైంది. దీంతో 108 వాహనంలో దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. చెల్లెలి బిడ్డ అంత్యక్రియలకు హాజరైన లావణ్య ఇంటికి వెళ్లే సరికి కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. చూస్తుండగానే బాలుడు కన్నుమూశాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు.