మాక్లూర్, ఏప్రిల్ 27: మండలంలోని చిక్లీ గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్‌తో ఐదేండ్ల చిన్నారి మృతిచెందింది. కూలర్ షాక్ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చిక్లీ గ్రామానికి చెందిన గడ్డం నవీన్, అర్చన దంపతులు బీడీ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆదివారం బీడీలు తీసుకోవడానికి తల్వేద గ్రామానికి వెళ్లారు.
ఇంట్లో వారి పెద్ద కూతురు వియాంకిత, ఆమె నానమ్మ మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం ఇంటి పక్కనే ఆడుకుంటున్న వియాంకిత ఇంట్లోకి వచ్చి ఐరన్ కూలర్‌ను ముట్టుకోగా, విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో ఇంటిపక్కనే పని చేస్తున్న ఓ మేస్త్రి వెంటనే బాలిక నానమ్మకు చెప్పగా..అప్పటికే వియాంకిత మృతిచెందింది. తమ కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.