వినాయక్‌నగర్, అక్టోబర్19: నిత్యం రోగులతో రద్దీగా ఉండే జీజీహెచ్‌లో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించే దవాఖానలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఏడాది బాలుడు అపహరణకు గురవ డం విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా.. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుల చిత్రా లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కిడ్నాప్‌నకు పాల్పడిన వారు ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. గడిచిన ఆరు నెలల్లో జీజీహెచ్ నుంచి ఇద్దరు కిడ్నాప్‌కు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మద్నూర్‌కు చెందిన రాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం.
రాజు నిజామాబాద్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. తన భార్య లక్ష్మి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెకు జీజీహెచ్‌లో పరీక్షలు చేయించాడు. రాత్రి కావడంతో స్వగ్రామానికి తన భార్యను శనివారం ఉదయం పంపిద్దామనుకొని లక్ష్మి, పిల్లలతో కలిసి దవాఖాన ప్రాంగణంలోని ఓ షెడ్డుకింద నిద్రించారు. వారికి అర్ధరాత్రి మెలకువ రావడంతో పక్కన చూడగా వారి ఏడాది బాబు (మణికంఠ) కనిపించలేదు. ఒక్కసారిగా కంగారుపడిన ఆ దంపతులు దవాఖాన అంతా వెతికినా బాబు ఆచూకీ లభించలేదు. దీంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు దవాఖాన వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజ్‌లను పరిశీలించగా ముగ్గురు మహిళలు కలిసి బాలుడిని ఎత్తుకుపోతున్నట్లు రికార్డయ్యింది. కేసు నమోదుచేసుకొని, చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.