ఆర్మూర్టౌన్, నవంబర్ 28 : అప్పటివరకు సంతోషంగా ఆడుకున్న చిన్నారి.. కాలువలో పడి కొన్ని క్షణాల వ్యవధిలోనే ప్రాణం కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. కుటుంబీకులు, స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్లో ఉండే మట్ట జ్యోతిక – ప్రసాద్ దంపతుల కుమార్తె మట్ట ధనస్వి (4) గురువారం ఉదయం ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న డ్రైనేజీలో పడింది.
అప్పటివరకు ఇంటి వద్ద ఆడుకున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి ఎదుట ఉన్న డ్రైనేజీలో చూడగా.. నీటి బుడగలు రావడంతో అందులో పడినట్లు గుర్తించి, స్థానికుల సహాయంతో గాలించారు. చిన్నారిని బయటికి తీసి దవాఖానకు తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదాలు జరగకుండా డ్రైనేజీ వద్ద ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.