విమానయానం ఉమ్మడి జిల్లా ప్రజలకు కలాగానే మిగలనుందా..? కేంద్ర సర్కారు జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు విషయాన్ని పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్‌లోని మామునూర్ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఆమోదం తెలుపుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్ జిల్లావాసుల గగన విహార కలను త్వరలోనే సాకారం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇన్ని రోజులు అడ్డంకిగా భావిస్తూ వచ్చిన 150 కిలో మీటర్ల నిబంధనను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సడలించడంతో కేంద్రం కూడా అందుకు అంగీకారం తెలిపింది. ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఎంత అవసరమో… ఉత్తర తెలంగాణకు గుండె కాయలాంటి నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఆవశ్యకత ఎంతో ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల కాలంలో అనేకసార్లు జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు విషయంపై కేంద్ర సర్కారుకు విన్నవించింది. భూసేకరణ, ఆర్థిక వనరుల కల్పనపైనా భరోసా అందించింది.
కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. చిగురించిన ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఎయిర్ స్ట్రిప్ వంటి కొంగొత్త ప్రతిపాదనలు తెరమీదకు తీసుకు వచ్చినప్పటికీ ప్రస్తుతం జక్రాన్పల్లిపై బీజేపీ సర్కారు కనీసం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని దశాబ్దాల ప్రతిపాదనను ముందుకు తీసుకు పోవాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉండడంతోపాటు దగ్గరలోనే రైల్వే సదుపాయం కూడా ఉన్నది. రవాణా వ్యవస్థకు ఈ ప్రాంతం అత్యంత అనుకూలమైన ప్రదేశం. దీంతో ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులకు జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టుతో ఎంతో సౌలభ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మినీ ఎయిర్‌పోర్టు నెలకొల్పితే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్ లాంటి జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుంది.
రోజురోజుకూ విమానయానం విస్తరిస్తున్నది. ఆకాశ మార్గాన ప్రయాణించే వారి సంఖ్యా పెరుగుతున్నది. పెరుగుతున్న జనాభా, ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టుల్లో రద్దీ దృష్ట్యా జక్రాన్‌పల్లి లాంటి ప్రాంతాల్లో మినీ ఎయిర్‌పోర్టు నెలకొల్పితే దేశీయ విమాన సర్వీసులకు ఎంతో మేలు జరుగనుంది. దీంతో ఉత్తర తెలంగాణ వాసులకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయమైతే శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు రద్దీ తగ్గే అవకాశం ఉన్నది. ప్రత్యక్ష, పరోక్ష లాభాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ హయాంలో జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు కోసం భారీగా ప్రయత్నాలు చేశారు. మామునూర్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర విమానయాన శాఖ అనుమతులు మంజూరు చేసినట్లే జక్రాన్‌పల్లికి సైతం మోక్షం ప్రసాదిస్తే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
జక్రాన్‌పల్లి వద్ద దేశీయ విమాన సర్వీసుల కోసం, మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పదేండ్లలో అనేక చర్యలు తీసుకోవడంతోపాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నూ చర్చలు కూడా జరిగాయి. మినీ ఎయిర్‌పోర్టుకు రూ.328కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ అధ్యయనం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు వెల్లడించింది. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు కోసం 510 ఎకరాల భూమి అవసరమని తేల్చింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు రూ.348 కోట్లు, 740 ఎకరాల భూమి అవసరమని అధ్యయన నివేదికలో పొందుపర్చింది. జక్రాన్‌పల్లి వద్ద ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండగా.. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కూడా లేదు.
డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు జక్రాన్‌పల్లి అనుకూలంగా ఉండడంతో డిమాండ్‌ను అనుసరించి ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నైకి సర్వీసులు నడిపేందుకు వీలు పడుతుందని ఎయిర్‌పోర్టు అథారిటీ సైతం భావించింది. కాని ఇంత వరకూ జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు అంశం ఎటూ తేలడం లేదు. దేశవ్యాప్తంగా ఎడాపెడా ఎయిర్‌పోర్టులను మోడీ ప్రభుత్వం స్థాపిస్తుండగా తెలంగాణలో మాత్రం నామమాత్రంగా పౌర విమానయాన రంగాన్ని ప్రోత్సహిస్తుండడంపై జనాల్లో చర్చ నడుస్తున్నది. 2019, 2024లో వరుసగా బీజేపీ ఎంపీలే ఉత్తర తెలంగాణలో గెలిచారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ ఎంపీలున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నదని ఇక్కడి ప్రజలు నిరాశతో ఉన్నారు.
జక్రాన్‌పల్లి, మార్చి 1 : జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటైతే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఉమ్మడి జిల్లా ప్రజలతోపాటు పక్కనే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ నుంచి విదేశాలకు వెళ్లే వారికి సౌకర్య వంతంగా ఉంటుంది. జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలి.
-అల్లూరి భాస్కర్‌రెడ్డి, జక్రాన్‌పల్లి
జక్రాన్‌పల్లి, మార్చి 1 :ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటైతే విదేశాలకు వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు అధికంగా ఉంటారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే వారందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రాన్ని ఒప్పించాలి.
-తలారి సతీశ్, జక్రాన్‌పల్లి