నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కొన్నేండ్లుగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశం సాగదీత వ్యవహారంగా మారింది. దశాబ్దకాలం నుంచి ఊరించి, ఊరిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలులేవు. గాలిమోటర్ గురించి ఊహాలోకంలో విహరించడం తప్ప క్షేత్రస్థాయిలో ఇసుక రేణువు కదలడంలేదు. పదేండ్లుగా ఎయిర్పోర్టు అంశం మరుగున పడుతూనే ఉంది. ఇటీవల పార్లమెంట్లో జిల్లా ఎంపీ అర్వింద్ జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశాన్ని లేవనెత్తగా.. ఇప్పటివరకు తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం.
ఏడాది క్రితం వరకు కేసీఆర్ హయాంలో జక్రాన్పల్లి ఎయిర్ పోర్టుపై ఆశలు సజీవంగా ఉండేవి. ఢిల్లీ పర్యటనలో ప్రతిసారి ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలంతా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర పౌర విమానయాన శాఖతో ప్రతిసారి సంప్రదింపులు జరిపేది. కానిప్పుడు ఈ అంశం వరంగల్ ఎయిర్ పోర్టుకే పరిమితమైంది. కాంగ్రెస్ సర్కారు సైతం వరంగల్లోని మామూనూరు ఎయిర్ పోర్టుపైనే దృష్టిసారించింది. గడిచిన ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు జక్రాన్పల్లి ఎయిర్ పోర్టు అంశంపై ఊసెత్తిన దాఖలాలులేవు. 2019 నుంచి రెండుసార్లు బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ బాధ్యత వహిస్తున్నప్పటికీ…ఎయిర్పోర్టు అంశంపై ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. ఎయిర్ పోర్టు అంశాన్ని మరుగన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎయిర్ పోర్టుపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించగా..కేంద్రం కూడా అందుకు సహకరిస్తోంది.
జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశం కేవలం మాటలకే పరిమితమవగా.. ఇప్పటివరకు స్థానికులకు పైసా ప్రయోజనం దక్కలేదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం భారీగా లాభాలు వచ్చాయి. ఎయిర్ పోర్టు అంశాన్ని బూచీగా చూపి ఇష్టారీతిన వ్యవసాయ భూములను తెగనమ్మేశారు. భూములకు ధరలు పెంచేసి ఇష్టారీతిన చేతులు మార్చారు. సామాన్యులకు లేనిపోని ఆశలు కల్పించి వెంచర్లు చేసి ప్లాట్లు కట్టబెట్టారు. రియల్ వ్యాపారులకు ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా మిగిల్చింది. కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు విని పెట్టుబడి పెట్టిన వారందరూ తీవ్ర నష్టమే చవి చూడాల్సి వచ్చింది. పెరగని గజం ధరలతో ఇక్కట్లు పడుతున్నారు. తీరా అమ్ముకుందామంటే కొనే వారు కరువయ్యారు. వ్యవసాయ భూములైతే ఇష్టారీతిన ధరలను చేర్చారు. రోడ్డుపై ఎకరా భూమి రూ.కోట్లలో చేరింది. ఎయిర్ పోర్టు ఏర్పాటు అంశాన్ని కారణంగా చూపి డిచ్పల్లి నుంచి మొదలు పెడితే ఆర్మూర్ వరకు 44వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా రియల్ వ్యాపారులు చేసిన దందా అనేక రీతుల్లో విస్తరించింది. పెట్టిన ధరకైనా పైసల్ వాపస్ వస్తే బాగుండును అనుకుని మదన పడుతున్నారు.
తెలంగాణ అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్ గతంలో జక్రాన్పల్లి ఎయిర్ పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై కనీసం పట్టించుకోవడం లేదు. జక్రాన్పల్లి వద్ద డొమెస్టిక్ విమాన సర్వీసుల కోసం మినీ ఎయిర్పోర్టు ఏర్పాటుకు కేసీఆర్ హయాంలో అనేక చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చలు కూడా జరిగాయి. మినీ ఎయిర్పోర్టుకు రూ.328కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ తేల్చింది. 510 ఎకరాల భూమి అవసరమని నివేదించింది. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు రూ.348కోట్లు, 740 ఎకరాల భూమి అవసరమని తేల్చింది. జక్రాన్పల్లి వద్ద ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండగా భూసేకరణకు ఎక్కువగా ఖర్చు అవసరమే లేదు. తెలంగాణలో కొత్తగా మొత్తం ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఈ ప్రకటనలు కేవలం వరంగల్ ఎయిర్పోర్టుకే పరిమితమయ్యాయి. ఆశాజనక పరిస్థితులు ఏర్పడిన జక్రాన్పల్లి ఏర్పాటు అంశంపై కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీల తీరుతో స్తబ్ధత ఏర్పడినైట్లెంది.