బాన్సువాడ : మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ఇటీవల కేటాయించిన బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ( Pocharam Bhaskar Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి (Graduate MLC Candidate) నరేందర్ రెడ్డికి మద్దతుగా బాన్సువాడ , బీర్కూర్ మండలాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు ఎలాంటి నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఇంటింటా ప్రచారంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తోనే ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీకి ఓటు వేయమని ఆ పార్టీ నాయకులు వస్తే తెలంగాణ కు ఏం ఇచ్చారని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, గంగాధర్ , మహ్మద్ ఎజాజ్, అఫ్రోజ్, కటికె రమేష్, రఫీ, అమేర్, తదితరులు పాల్గొన్నారు.