ప్రభుత్వ ఉద్యోగం.. యువతకు జీవిత కల. వారి కలను సాకారం చేసేందుకు ప్రజాప్రతినిధుల అన్ని విధాలా సహకారాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచారు. ఉమ్మడి జిల్లాలోని శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ శిక్షణ శిబిరాలు సత్ఫలితాలను అందించాయి. డిచ్పల్లి మండలకేంద్రంలోని ఏడో పోలీస్ బెటాలియన్‌లో కోచింగ్ తీసుకున్న 125 మంది అభ్యర్థులు సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా, ఇందులో మొత్తం 71 మంది అర్హత సాధించడంతో ప్రజాప్రతినిధుల ప్రయత్నం ఫలించింది.
-డిచ్పల్లి, నవంబర్ 11
పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన వెంటనే నిరుద్యోగులు సంబురపడ్డారు. కానీ కాంపిటీషన్ అధికంగా ఉండడంతో శిక్షణ తప్పనిసరిగా మారింది. అర్హత ఉన్నప్పటికీ రూ. వేలల్లో ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునే స్థోమత లేని ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులకు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి కల్పించి పూర్తి సహకారాన్ని అందించారు. ఇందులో భాగంగా డిచ్పల్లిలోని 44వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పోలీస్ ఏడో బెటాలియన్‌లో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులకు 60 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. తరగతులు నిర్వహించేందుకు హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అనుభవం ఉన్న ట్రైనీలను నియమించారు. బాజిరెడ్డి జగనన్న యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌ను రూపొందించి లైవ్ క్లాసులను అందుబాటులోకి తెచ్చారు. కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రతిరోజూ పరీక్షలు నిర్వహిస్తూ మంచి నైపుణ్యం సాధించేలా అభ్యర్థులను తీర్చిదిద్దారు.
71 మంది అభ్యర్థులు క్వాలిఫై..
రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాల్లో 46 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న 125 మంది పరీక్ష రాయగా, మొత్తం 71 మంది ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించారు. ఆరుగురు అభ్యర్థులు సబ్ ఇన్స్పెక్టర్, 65 మంది పోలీస్ కానిస్టేబుల్ తదుపరి పరీక్షలకు క్వాలిఫై కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నం ఫలించిందని పేర్కొంటున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన నిరుద్యోగులు.. తమకు ఉచిత శిక్షణకు అవకాశం కల్పించిన ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు, అన్ని విధాలా సహకరించిన ధర్పల్లి జడ్పీటీసీ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
శిక్షణలో అన్నీ తానై..
పోలీస్ ఏడో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు, ధర్పల్లి జడ్పీటీసీ జగన్ తీవ్రంగా కృషి చేశారు. కోచింగ్ సెంటర్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ అభ్యర్థులకు ఎలాంటి లోటు రాకుండా అన్నీ తానై చూసుకున్నారు. అరవై రోజులపాటు సాగిన ఈ శిక్షణలో తరగతులు మొదలుకొని స్టడీ మెటీరియల్, భోజన వసతి, ఇతరత్రా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈవెంట్స్ ప్రిపరేషన్‌కూ కోచింగ్ ఇప్పిస్తాం..
పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందనలు. క్వాలిఫై అయినవారికి మెయిన్స్ ఈవెంట్స్‌కు సిద్ధమయ్యేలా బెటాలియన్‌లో మళ్లీ ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. ప్రిలిమ్స్ కోసం అభ్యర్థులకు 60 రోజులపాటు నాణ్యమైన కోచింగ్ అందించాం. ఇందుకు సహకరించిన బెటాలియన్ ఐజీ అభిలాష బిష్త్, కమాండెంట్ సత్యశ్రీనివాస్‌రావు, సెంటర్ కో-ఆర్డినేటర్ నీరడి దినేశ్‌తోపాటు ఫ్యాకల్టీకి ధన్యవాదాలు. అందరి సహకారంతో 125 మంది పరీక్షలు రాయగా, ఆరుగురు ఎస్సై, 65 మంది కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. పేద యువతకు బాసటగా నిలిచిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటాం.
-బాజిరెడ్డి జగన్, ధర్పల్లి జడ్పీటీసీ