మోర్తాడ్, డిసెంబర్ 28: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎతు ్తలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అయితే పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఓడినా, గెలిచినా ఫలితాలు విడుదలైన 45 రోజు ల్లో ఎంపీడీవోలకు ఎన్నికల ఖ ర్చుల లెక్కలు చెప్పాల్సి ఉంటుం ది. లెక్కలు చెప్పే విషయంలో అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై ఎన్నికల సంఘం ద్వారా వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా లెక్క తప్పినట్లయితే భవిష్యత్తులో పోటీ చేయకుండా చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలకు గాను 86 సర్పంచ్ స్థానాలు, 1,739 వార్డులు ఏకగ్రీవం కాగా 459 సర్పంచ్, 3,259 వార్డుస్థానాలకు అధికారులు మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు.
459 సర్పంచ్ స్థానాలకు 1,676 మంది, 3,259 వార్డుస్థానాలకు 9,083 మంది పోటీచేశారు. వీరు నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు చేసిన ఖర్చుల వివరాలు రోజు వారీగా ఎన్నికల అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. చాలా మంది అభ్యర్థులు ఈవిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. 5వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.1.50 లక్షలు, వార్డుఅభ్యర్థులు రూ.30వేల లోపు, ఐదు వేల కన్నాజనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.2.50 లక్షలు, వార్డుఅభ్యర్థులు రూ.50వేల లోపు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దీనికి లోబడి అభ్యర్థులు అధికారులకు ఎన్నికల ఖర్చులు చూపించాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అధికారులకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలు నిర్దేశించిన గడువులోపు చెప్పకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవిని కోల్పోయే అవకాశంతోపాటు మూడేండ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే అవకాశాలూ ఉన్నాయి. జిల్లాలో మూడువిడుతల్లో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తేదీ నుంచి 45రోజుల్లో అధికారులకు ఖర్చులకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.
దీనిని బట్టి డిసెంబర్ 11న ఎన్నికలు జరిగిన గ్రామాల అభ్యర్థులు జనవరి 24న, రెండోవిడుత డిసెంబర్ 14న ఎన్నికలు జరిగిన గ్రామాల అభ్యర్థులు జనవరి 27, మూడోవిడుత డిసెంబర్ 17న ఎన్నికలు జరిగిన గ్రామాల అభ్యర్థులు జనవరి 30 వరకు ఎన్నికల ఖర్చుల వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఖర్చుల వివరాలు అధికారులకు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పదవులు పోగొట్టుకునే గండం ఉన్నదని, అంతేగాకుండా మూడేండ్ల పాటు పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉన్నదనే విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తించాల్సిన అవసరం ఉంది.