కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(CPI) మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ( Vittal Goud ) అన్నారు. ఆదివారం కోటగిరిలో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ ( Kotagiri Bus Stand ) పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు.
20 ఏళ్లుగా బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో నిలబడుతున్నారని వాపోయారు. నూతన బస్టాండ్ ఏర్పాటు చేయడంలో ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కనీసం మూత్రశాలలు ( Toilets ) కూడా లేవని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రయాణికుల కోసం తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేయాలని, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
తాత్కాలిక బస్టాండ్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు నల్లగంగాధర్, గూడాల రాములు, వీరేశం, గంగాధర్, చాకలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.