ఖలీల్‌వాడి, జూన్ 11 : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు పిలిచిన రోజు తెలంగాణకు బ్లాక్‌డేగా మిగిలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతిపిత, మహా ఉద్యమ నేత కేసీఆర్‌ను విచారణకు పిలిచిన జూన్ 11వ తేదీని ప్రజలు చీకటి దినంగా భావిస్తున్నారని తెలిపారు.
రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ఏదో కొంపలు మునిగినట్లు ఉద్యమ యోధుడిని విచారణకు పిలవడం తెలంగాణకే తలవంపని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలుసా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మహా జలశక్తి పీఠమని, ఇది తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటమని అభివర్ణించారు.
కాళేశ్వరం చూసి ప్రపంచమే అబ్బురపడింది..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చూసి ప్రపంచమే అబ్బురపడిందని గుర్తుచేశారు. కేసీఆర్ దక్షతను శత్రువులు కూడా అభినందించకుండా ఉండలేకపోయారని, చివరకు తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు కూడా కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని మెచ్చుకున్నారని తెలిపారు. కానీ ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మాత్రం ప్రాజెక్టుపై కక్ష కట్టాడని మండిపడ్డారు. కేసీఆర్ దక్షతను చూసి కాంగ్రెస్ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నదని, కాళేశ్వరం కాలువల ద్వారా సాగునీటిని పారిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం విషం పారిస్తున్నాడని విమర్శించారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి అంటగట్టి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు మట్టి కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించినా ప్రజలు సహనంగా ఉన్నారని, రేవంత్‌రెడ్డి తిట్లు కూడా భరిస్తున్నారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్‌ను విచారణకు పిలువడాన్ని రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారని తెలిపారు. రేవంత్ కథ ముగిసిందని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఆయనను తరిమికొట్టుడే అని పేర్కొన్నారు.