తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ.. ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది. ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తదనంతరం ప్రజలు బీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారు. ఉద్యమ కెరటం, గులాబీ దళపతి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పాలన చేపట్టారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించి అందరివాడయ్యారు.
అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పాలన..స్వర్ణయుగమని నేటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేడు పల్లెపల్లెనా సజీవంగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణ దశ దిశను మార్చిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పురుడుపోసుకొని నేటితో 24 ఏండ్లు పూర్తిచేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నేడు (ఆదివారం) బీఆర్ఎస్ రజతోత్సవ సభను అంగరంగా వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు వేల సంఖ్యలో తరలివెళ్లడానికి ఉత్సాహంతో ఉన్నారు.
నిజామాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నేడు నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలువనున్నది. చారిత్రక వరంగల్ వేదికగా నిర్వహించనున్న సభ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరోసారి ప్రజలకు గుర్తు చేయనున్నది. అదే సమయంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలనూ ఎండగట్టనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి బీఆర్ఎస్ పార్టీ సభ ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించగా..ఆనాడు ఆర్మూర్ సభ పంతం… తెలంగాణ సొంతం… ఆంధ్రా పాలన అంతం అనే నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.
ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రస్థానం
బీఆర్ఎస్ రెండున్నర దశాబ్దాల ఉద్యమ ఘట్టాల్లో ఉమ్మడి జిల్లాకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. తెలంగాణ ధూం ధాం సాంస్కృతిక ఉద్యమం తొలిసభ కామారెడ్డి వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా వేల్పూర్ మండలం మోతె గ్రామ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని స్వయంగా సమైక్య పాలనలో సందర్శించి మట్టితో ముడుపు కట్టారు. స్వరాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ మోతె గ్రామాన్ని సందర్శించి ముడుపు విప్పారు. 2001లో పార్టీ పురుడు పోసుకున్న తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ ఎంపీటీసీ, జడ్పీటీసీలతో నాటి అధికార టీడీపీకి గులాబీ జెండా ముచ్చెమటలు పట్టించింది. తదనంతర కాలంలో జడ్పీ పీఠాన్ని గులాబీ పార్టీ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
25ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానం
25 ఏండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఉద్యమంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఎన్నికల్లో నిరాశజనకమైన ఫలితాలను చవి చూసింది. కష్టకాలంలో అనుమానా లు, భయాలు లేకుండా నిర్భయంగా తెలంగాణ వ చ్చి తీరుతుందని మొక్కవోని విశ్వాసంతో ముం దుకు సాగింది. పార్టీ రజతోత్సవ సభ నిర్వహణకు ఉద్యమ ఖిల్లా ఓరుగల్లు వేదిక కావడం ఉద్యమకారుల్లో భావోద్వేగాన్ని రగిలిస్తున్నది. కేసీఆర్ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది స్వచ్ఛందంగా సభకు వెళ్లేందుకు సిద్ధం కాగా,, చాలా మంది టీవీల్లో కేసీఆర్ ప్రసంగాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
స్ఫూర్తి నింపిన ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ..
ఎన్నో ఎన్నికల్లో విజయ కేతనాన్ని ఎగరవేసిన బీఆర్ఎస్కు 2008 ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో చేదనుభవాలు ఎదురయ్యాయి. మళ్లీ ఉప ఎన్నికలకు ఉపక్రమించడాన్ని చూసి సమాజం నివ్వెర పోయింది. కథ పునరావృతమవుతుందని తెలంగాణ వ్యతిరేకులు సంతోష పడ్డారు. చావో రేవో తేల్చుకోవాలని తెగింపుతో మొత్తం 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి ఎల్లారెడ్డి సైతం ఉంది. ఎన్నికలు జరిగి 2010, జూలై 30న ఫలితాలు వెలువడ్డాయి. ఏడాది పాటుగా కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయాయి. బీఆర్ఎస్ మెజార్టీ సునామీ సృష్టించింది. కాంగ్రెస్ అతిరథులంతా కొట్టుకు పోయారు. అన్ని చోట్ల టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో నిజామాబాద్లో ఆనాడు బీజేపీ విజయం సాధించింది. అదే ఒరవడిలో 2011లో బాన్సువాడ, 2012లో కామారెడ్డిలో టీడీపీకి పోచారం, గంప గోవర్ధన్ రాజీనామా చేయగా తిరిగి బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించారు.