నిజామాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా మరోసారి కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ బిడ్డగా రాష్ట్రం నలుమూలలా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్న కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కామారెడ్డి పట్టణంలో ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ అని గంప గోవర్ధన్ తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో కండ్ల ముందే కనిపిస్తున్నదన్నారు.
కేసీఆర్ పరిపాలనలోనే కామారెడ్డి జిల్లా కేంద్రమైన తర్వాత వందల కోట్లతో అభివృద్ధి జరిగిందని గంప గోవర్ధన్ వెల్లడించారు. మ్యానిఫెస్టోలో చెప్పకుండానే రైతుల పరిస్థితిని చూసి చలించిన కేసీఆర్… వారి కన్నీ ళ్లు తుడిచేందుకు రైతుబంధు తీసుకువచ్చారన్నారు. కానీ రైతును కేంద్రం ఏ విధంగా ఆదుకోవడం లేదన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను తీసుకురాలేదని చెప్పారు. రైతుబిడ్డ కాబట్టే కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మూడున్నరేండ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి కేసీఆర్ రికార్డు నెలకొల్పారన్నారు. ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కళకళలాడుతున్న తెలంగాణను చూస్తుంటే కడుపు నిండుతున్నదని చెప్పారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హ్యాట్రిక్ సీఎంగా కామారెడ్డి నుంచి గెలవబోతున్నారని చెప్పా రు. తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు కామారెడ్డి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఎంచుకోవడం గొప్ప విషయని.. ఇది చాలా మంది స్వాగతిస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని.. ఊహించని రీతిలో కామారెడ్డి నిలువబోతున్నదన్నారు. రకరకాల పార్టీలు, అలవి కాని హామీలు ఇస్తూ ఏదో చేస్తామంటున్నారని.. అధికారంలో ఉన్న రోజులు ఏమీ చేయలేదని, వారిని తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ప్రభు త్వం వస్తుందని.. భారీ మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ముఖ్య నాయకులు నిట్టు వేణుగోపాల్, నర్సింగరావు, రాజేశ్వర్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.