ఖలీల్‌వాడి, నవంబర్ 9 : గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయా విద్యాసంస్థలను సందర్శించనున్నట్లు బీఆర్ఎస్వీ నేతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకుని మంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్వీ నేత పొద్దుటూరి అభిలాశ్రెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. అన్ని గురుకులాలను సందర్శించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గురుకులాల్లో విద్యార్థులు మృతి చెందుతున్నా సీఎం గానీ, మంత్రులు గానీ కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించక పోవడం దారుణమని తెలిపారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.. హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే వారికి బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో వారు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదన్నారు. ఏడాదికి రెండు యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉండగా, రేవంత్ సర్కారు ఒక్కటే ఇస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రెస్మీట్లో ప్రశాంత్ కునాల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.