మోర్తాడ్, జూన్ 1: ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు తాలు పేరుతో కడ్తా తీస్తే తోలు తీస్తామని అన్నారని, మరిప్పుడు క్వింటాలుకు పది కిలోల కడ్తా తీస్తుంటే రైతులు లబోదిబోమంటున్నారని, ఎవరి తోలు తీయాలో చెప్పాలని బీఆర్ఎస్ నా యకులు ప్రశ్నించారు. మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రైతుల కష్టా లు చూడలేక కల్లాల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను గుర్తించి వడ్లు కొనుగోలు చేసే విధంగా ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు సూచనలు చేస్తుంటే, ఓర్వలేక రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాలమోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ అన్నారు. సోమవారం ఆయన కమ్మర్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.
వడ్ల కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేముల ప్రశాంత్‌రెడ్డి రైతులకు న్యాయం జరగాలని దాదాపు రెండుగంటల పాటు మండుటెండలో రాస్తారోకో చేశారని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు ఎందుకు వెళ్లలేదని, వారి కష్టాలను ఎందుకు తీర్చలేదని, కడ్తా ఎందుకు తీస్తున్నారని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రైతులు నష్టపోతున్నా నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదన్న విషయాన్ని ఏ ఒక్క రైతును అడిగినా చెప్తారని అన్నారు. సర్పంచు లు హారిక, మహబూబ్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ సర్పంచ్ గడ్డంస్వామి, ఏనుగు గంగారెడ్డి, సంత రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, భాస్కర్, సుభాష్‌గౌడ్, సుధాకర్, రెంజర్ల మహేందర్, నరేందర్, మురళి పాల్గొన్నారు.