వినాయక్‌నగర్, జనవరి 21: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఫొటోలను మార్ఫింగ్ చేసి హేళన చేసేలా ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని ఇన్చార్జి సీపీ సింధూశర్మను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. ధర్మపురి అరవింద్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ నీతూకిరణ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్ విశాలినిరెడ్డి, సుమనారెడ్డి సీపీని కలిసిన వారిలో ఉన్నారు.
మహిళా ప్రజాప్రతినిధిని కించపరిచేలా పోస్టులు పెట్టడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మేయర్ నీతూకిరణ్ పేర్కొన్నారు. ఇన్చార్జి సీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అరవింద్ ధర్మపురి ఆర్మీ అనే ఐడీతో పోస్ట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ ధర్మపురి అనుచరులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, కనీసం మహిళాప్రజా ప్రతినిధి అనే గౌరవం లేకుండా కించపరచటం సిగ్గు చేటని మండిపడ్డారు.