్తడ్/భీమ్‌గల్/బాల్కొండ, డిసెంబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే అక్రమంగా కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసులు, అరెస్టులతో అసమర్థతను కప్పి పుచ్చుకోవాలనుకోవడం సర్కారు అవివేకమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ పలు మండలాల్లో పార్టీ శ్రేణులు శుక్రవారం నిరసనలు నిర్వహించాయి.
మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, భీమ్‌గల్ తదితర మండలాల్లో పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ.. సర్కారు తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై అక్రమంగా కేసులు పెట్టి ఆయన గొంతు నొక్కలేరన్నారు. బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కారు కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణతో తెలంగాణ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిందన్నారు. కారు రేసింగ్ నిర్వహణలో ఎక్కడా అవినీతి జరుగలేదని, కేటీఆర్‌ను ఎలాగైనా ఇరికించి అరెస్టు చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని విమర్శించారు.
ఈ వ్యవహారంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దామని కేటీఆర్, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ముందుకు రాకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. అక్రమ కేసులు, బెదిరింపులు, అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా భయపడేదే లేదని, కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని తెలిపారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం ఆపి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.